మల్లన్న దెబ్బ కి అల్లాడుతున్న కేసీఆర్…

మల్లన్నసాగర్‌… ఈ పేరింటేనే ఇపుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు గొంతపట్టేస్తోంది. జీవో 123 ప్రకరాం మంచినీళ్ల ప్రాయంగా భూములు సేకరిస్తున్న ప్రభుత్వానికి ‘ 2013 భూసేకరణచట్టం’ ఎక్కిళ్లు తెప్పిస్తోంది. ఇక ముందు సేకరించబోయే భూములతోపాటు.. ఇప్పటిదాకా సేకరించిన భూములకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాల్సిన పరిస్థితి వచ్చింది. కుర్చీమీద కూర్చున్నది మొదలు… తనకు ఎదురేలేదన్నట్టు వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తొలిషాక్‌ మల్లన్నసాగర్‌ రూపంలో తగిలింది. తాము అనుకున్నదే చేస్తామని మొండిపట్టుదలకు పోయిన సర్కారు హైకోర్టులో మెత్తబడింది. నిర్వాసితుల కోరిన విధంగా పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. పరిహారం చెల్లింపుపై మంత్రి హరీష్‌రావు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శితో సమాలోచనలు జరుపుతున్నారు.

జీవో నంబర్‌ 123 ప్రకారం ఇప్పటిదాకా లక్షాతొంబైవేల ఎకరాలకుపైగా సేకరించింది కేసీఆర్‌ సర్కార్‌. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఇంకా 2లక్షల ఎకరాల వరకు భూసేకరణ చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు కూడా అందాయి. కానీ… మల్లన్నసాగర్‌ దగ్గరకు వచ్చేసరికి భూసేకరణ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వాసితులు పోరుబాటపట్టారు. సర్కారు తీరును ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో… పాలకులు దిగిరాకతప్పలేదు. 123జీవో ప్రకారం భూములను ఇచ్చేందుకు ఇష్టడని రైతులకు… 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం ఇస్తామంటూ.. న్యాయస్థానం ముందు ఒప్పుకోవాల్సి వచ్చింది.

కోర్టు ఆదేశంతో గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టైంది కేసీఆర్‌ ప్రభుత్వానికి. ఇంకా సేకరించాల్సిన లక్షలాది ఎకరాలకు 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలంటే …ఖర్చు తడిసిపోపెడయ్యే అవకాశం ఉంది. పైగా జీవో123 ప్రకారం తమ భూములను ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు …తమకూ 2013 చట్టాన్నే వర్తింపజేయాలని పేచీపెడుతున్నారు. దీంతో మింగలేక కక్కలేక ఉక్కిరిబిక్కిరవుతోంది టీఆర్‌ఎస్‌ సర్కారు. జీవో 123 ప్రకారం అయితే… భూములకు మాత్రమే పరిహారం ఇస్తే సరిపోయేది. కాని.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం.. పరిహారంతోపాటు… నిర్వాసితులకు పునరావాసం కూడా కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం వేసుకున్న అంచనాలకు… ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పొంతనే లేకుండా పోవడంతో… మొత్తం ఖర్చు ఎంతొస్తుందోనని లెక్కలు కడుతున్నారు మంత్రి హరీష్‌రావు.

ఇదిలావుంటే… అటు టీజేఏసీ మరింత స్పీడ్‌ పెంచింది. నిర్వాసితుల తరపున జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ గొంతుపెంచారు. భూసేకరణలో లొసుగులను ప్రజల్లో ఎత్తిచూపుతున్నారు. 2013 చట్ట ప్రకారం పరిహారం ఇచ్చినా… 4ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తిచేయకుంటే.. భూములను తిరిగి ఇచ్చేయాలనే నిబంధనలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.
మొత్తనికి మల్లన్నసాగర్‌ దగ్గరకు వచ్చేసరికి సర్కార్‌కు నీళ్లుతాగించారు నిర్వాసితులు. దీనికి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు తోడవడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయినా.. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామంటూ పాలకులు మేకపోతుగాభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.