కాంగ్రెస్ ఖేల్ ఖతం-ఇది కెసియార్‌ జమానా!!

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖతం చెయ్యాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసియార్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. డి.శ్రీనివాస్‌ని టిఆర్‌ఎస్‌లోకి తీసుకొచ్చి, ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టడం వెనుక వ్యూహం ఇదే. అంతకు ముందే కేశవరావుని కూడా కెసియార్‌, టిఆర్‌ఎస్‌లోకి తీసుకురాగలిగారు. కేశవరావు, డిఎస్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఎంతో కీలక నేతలుగా ఉండేవారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేత వెంకటస్వామిని కూడా తీసుకురావాలనుకున్నారుగానీ, కుదరలేదు. ఆయన కుమారులిప్పుడు టిఆర్‌ఎస్‌లోకి వెళ్ళిపోయారు. అతి త్వరలో ఇంకో కాంగ్రెసు ముఖ్య నేత పొన్నాల లక్ష్మయ్య కూడా టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారమ్‌.

తెలంగాణ ఇచ్చినా, టిఆర్‌ఎస్‌ని లేకుండా చెయ్యాలనీ, తన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకం చెయ్యాలని భావించిన కాంగ్రెసు పార్టీపై కెసియార్‌ కక్ష పెట్టుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. నారాయణ్‌ఖేడ్‌, పాలేరు ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌ని కూడా గౌరవించకుండా టిఆర్‌ఎస్‌ ఎన్నికల బరిలోకి దిగడానికి ఇదే కారణమట. ఏదేమైనా కెసియార్‌ టైమ్‌ నడుస్తోంది. తెలంగాణలో ఆయన ఏం చెబితే అదే వేదం. ఆయన్ని కాదని, ఏ పార్టీ నాయకుడూ మనుగడ సాధించలేరు. ఇది కెసియార్‌ జమానా. రాచరికం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి బంగారు తెలంగాణ కోసం ఏదైనా చేస్తామని కెసియార్‌ చెప్పడంలోనే ఆయన మనసులోని రాజకీయ వ్యూహాలు అర్థమవుతున్నాయి. ఇంకో రెండు మూడు నెలల్లోనే కాంగ్రెసు పార్టీని తెలంగాణలో పూర్తిగా ఎండగట్టేయనున్నారట కెసియార్‌.