ఉద్యోగుల మెడపై కత్తి!!

ఎంత మంది ఎన్ని వినతులు, వేడుకోలులు చేసినా ప్రభుత్వోద్యోగుల విషయం లో చంద్రబాబు కనీసం కనికరం కుడా లేకుండా తరలి రావాస్లిందే అన్నట్టు హుకుం జారి చేసారు.దీనికి తోడు స్థానికత అంశాన్ని మెలిక పెట్టి ఉద్యోగులపై తనదైన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు.ఇంకేముంది అడిగే దిక్కులేక,చేసేదేమీ లేక కొత్త రాజధాని అమరావతికి తరలేందుకు ఉద్యోగుల్లో సందడి మొదలైంది. తరలింపు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేయడంతో సచివాలయ ఉద్యోగులు శని, ఆదివారాల్లో విజయవాడకు వెళ్ళి అద్దె ఇళ్ళ కోసం అన్వేషిస్తున్నారు. తాత్కాలిక సచివాలయం వెలగపూడి వద్ద సిద్దమవుతుండటంతో సచివాలయ ఉద్యోగులు తమ ఇళ్ళను, పిల్లలకు స్కూళ్ల, కళాశాలలను ఆచుట్టపక్కల ప్రాంతాల్లో చూచుకుంటున్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే మున్సిపల్ డైరెక్టర్‌ను ఏర్పాటు చేయడం, సాంఘిక, గిరిజన సంక్షేమంతో పాటు పలు డైరెక్టరేట్ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటవుతున్నాయో ఖరారు కావడంతో ఆయా కార్యాలయాల సిబ్బంది కూడా ఇళ్లకోసం అన్వేషణ ప్రారంభించారు. ఇప్పటికే రెవిన్యూకు సంబంధించి సీసీఎల్ఏ, సెక్రట్రేరియల్ ఉద్యోగులు సుమారు 150 మంది రాజధాని ప్రాంతంలో అద్దె ఇళ్లను చూచుకుని వచ్చారు.

భార్యభర్తల్లో ఒకరు తెలంగాణా ప్రభుత్వంలోనో, హైదరాబాద్‌లోనో 9,10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న వారు మాత్రం రాజధాని ప్రాంతంలో అద్దె ఇళ్లు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. ఇప్పటికు హైదరాబాద్‌లో ఉన్న ఇంటికి అద్దె చెల్లిస్తుండటంతో మరో అద్దె ఇల్లు తీసుకునే పరిస్తితి లేక ముగ్గురు, నలుగురు ఉద్యోగులు కలిసి అద్దె ఇల్లు తీసుకొనేందుకు మొగ్గుచూపుతున్నారు. సుమారు 40 మంది ఉద్యోగులు ఇప్పటికే విజయవాడలో కాపురం పెట్టి, తమ పిల్లలను స్కూళ్లలో చేర్చారు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇలా ఉంటే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అరకొర జీతంతో కొత్త రాజధానిలో నెట్టుకురాగలమా, అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. వారికి జీతాలు పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా, ఇంతవరకు స్సష్టమైన ఆదేశాలివ్వకపోవడంతో వారు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.