అక్కడా కేసీర్ యే ముందున్నాడు

తెలంగాణ న్యాయవాదులు, జడ్జీలు, న్యాయాధికారులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఈ విషయంలో అధికార టీఆర్ఎస్ ఒక అడుగు ముందుండగా, విపక్షాలు కాసింత వెనుకబడిపోయాయి. ఉమ్మడి హైకోర్టును విభజించాలని న్యాయవాదులు గత కొన్నాళ్లూగా ఆందోళనలు చేస్తున్నారు. హైకోర్టు విభజించకుండానే, జడ్జీలను, న్యాయాధికారుల కేటాయింపుల వల్ల స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని దశలవారీగా వారు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆప్షన్ల పేరుతో ఆంధ్ర ప్రాంత జడ్జీలను, న్యాయాధి కారులను ప్రాథమికంగా కేటాయించడాన్ని నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన తెలంగాణ ప్రాంత జడ్జీలు, న్యాయాధికారులు రోడ్డెక్కారు. జడ్జీలు, న్యాయా ధికారులు క్రమశిక్షణ ఉల్లంఘించారన్న కారణంతో తొలుత తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులను హైకోర్టు సస్పెన్షన్ చేయడంతో న్యాయ వాదులు ఆందోళలను తీవ్రరూపం దాల్చాయి. అనంతరం మరో తొమ్మిది మందిని సస్పెన్షన్ చేయడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి ఇప్పటి వరకు అన్ని రాజకీయపక్షాలు సంఘీభావాన్ని ప్రకటిస్తూ వచ్చాయి. అయితే న్యాయమూర్తుల సస్పెన్షన్ అనంతరం రాష్ట్రంలో న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ఉమ్మడి హైకోర్టు విభజన పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తాత్సార వైఖరిని నిరసించడంలో టీఆర్ఎస్ ముందువరుసలో నిలిచింది.

జడ్జీలు, న్యాయాధికారులను సస్పెండ్ చేయాన్ని అధికార టీఆర్ఎస్ తీవ్రం గా పరిగణిస్తూ, వారి ఆందోళనలకు సంఘీభావాన్ని ప్రకటించింది. న్యాయ వాదులు, న్యాయమూర్తుల ఆందోళన పట్ల స్సందించిన ఉమ్మడి హైకోర్టును తక్షణమే విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. హై కోర్టు విభజన అనంతరమే జడ్జీలను, న్యాయాధికారులను కేటాయించా లన్నారు. హైకోర్టు విభజన చేపట్టకపోతే, ఢిల్లీ జంతర్, మంతర్ వద్ద దీక్ష చేసేందుకు రెడీ అన్న సంకేతాలను ఆయన ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 31 ప్రకారం ప్రస్తుత హైకోర్టును విభజించి, ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం జరిగిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. న్యాయాధి కారుల కేటాయింపు తీరుపై తెలంగాణ న్యాయవాదులు, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయవాదుల ప్రక్రియను మే 3న ప్రారంభించడం జరిగిందని, తెలంగాణకు 95 మందిని, ఆంధ్రకు 110 మంది సబార్డినేట్ జడ్జీలను కేటాయించారన్న పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన 95 మందిలో ఆంధ్ర స్థానికతకు చెందిన వారు 85 మంది ఉన్నా రని వెల్లడించారు. సీనియర్, జూనియర్, సివిల్ జడ్జీలను కలుపుకుని తెలంగా ణకు ఆంధ్ర ప్రాంత స్థానికత కలిగిన 143 మందిని కేటాయించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

స్వరాష్ట్ర సాధన అనంతరం కూడా న్యాయవ్యవస్థ నియమాకాల్లో తెలంగాణ ప్రాంతం వారికి జరుగుతున్న అన్యాయంపై టీఆర్ఎస్ నాయకత్వం గళమెత్తడంలో ముందు వరుసలో ఉండగా, కాంగ్రెస్, టీ-టీడీపీలు వెనుక బడిపోయాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి టీఆర్ ఎస్ ఎంపీలు సంఘీభావాన్ని ప్రకటిస్తూ కేంద్రన్యాయశాఖ మంత్రి సదానం దగౌడను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. న్యాయవాదులు, న్యాయమూ ర్తులు చేస్తున్న ఉద్యమానికి తాము కూడా దన్నుగా ఉన్నామని ప్రకటిస్తున్న విపక్షాలు, ఈ ఉద్యమ క్రెడిట్ అధికారపార్టీకి దక్కకుండా నష్టనివారణ చర్యలు చేపట్టాయి. కేంద్ర మంత్రిని బుధవారం మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా 11 మంది జడ్జీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరినట్లు అనంతరం షబ్బీర్ అలీ మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రులిద్దరు కూర్చోని మాట్లాడుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయశాఖ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టంగా విభజన చట్టంలో చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు వేయకపోవడం సరికాదని పేర్కొన్నారు. హైకోర్టు విభజన అంశంపై కర్రవిరగొద్దు, పాము చావద్దు అన్నట్లుగా టీ- కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు చేస్తున్న ఉద్య మానికి దన్నుగా నిల్చామన్న క్రెడిట్ దక్కించుకునేందుకు ఒకవైపు ప్రయత్ని స్తూనే మరొకవైపు ఈ వ్యవహారంలో విభజనచట్టాన్ని రూపొందించిన తమ పార్టీ నాయకత్వాన్ని ఎవరు విమర్శించకుండా జాగ్రత్తపడుతోంది. హైకోర్టు విభజన అంశంలో కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాన్ని టీ- టీడీపీ నాయకత్వం చేస్తోంది. ఈ వ్యవహారంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ పూర్తిగా మద్దతునిస్తుందని పేర్కొన్నారు.