మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి బుదర జల్లే ప్రయత్నం! ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రజల్లో చులకన చేసే దుష్ప్రచారానికి తెగడబడుతూనే ఉంది `సాక్షి` మీడియా! ఆయన చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెబుతూ.. రంధ్రాన్వేషణ చేస్తూ.. నిరంతరం, ప్రతిక్షణం తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. పదాలకు కొత్త అర్థాలు చెబుతూ.. మాటలకు కొత్త భాష్యాలు వెతుకుతూ.. ప్రజల్లో ఆయన్ను మరింత దిగజార్చాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ సన్మాన సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మరోసారి తన సంకుచిత స్వభావాన్ని బయటపెట్టింది.
విజయవాడలో క్రీడాకారుడు శ్రీకాంత్ కిడాంబిని సీఎం చంద్రబాబు సన్మానించారు. సాధారణంగా ఈ వార్త సాక్షి ఎక్కడో పేజీ చివరనో, ఏదో మూలనో ప్రచురిస్తుంది. కానీ చంద్రబాబు ఐటమ్‌ని బ్యానర్‌గా చేయాలంటే.. అందులో ఏదో ఉండే ఉండాలి కదా! చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెంచేలా హెడ్డింగులు పెట్టే ఆ సంస్థ.. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేసింది. `ఒలిపింక్స్ లో గెలిస్తే నోబెల్ ఇస్తా’ అని చంద్రబాబు ప్రకటించినట్టు ఆ కథనంలో రాశారు. అయితే చంద్రబాబు ఏమిటి,, నోబుల్‌ను ఎలా ఇవ్వగలరు అని ప్రజల్లో ఆయన గురించి చులకనగా మాట్లాడుకో వా ల నేది పత్రిక ప్రధాన ఉద్దేశం!
కానీ నిజానికి, శ్రీకాంత్ ను సన్మానించిన సందర్భంలో చంద్రబాబు వ్యాఖ్యలు జాగ్రత్తగా వింటే.. గతంలో ఆయన చెప్పిన మాటలకు కొనసాగింపుగా ఉంటాయే తప్ప… తానే ఏదో నోబెల్ ఇచ్చేస్తా అన్నట్లు ధ్వనించదు. `మన పిల్లలు ఒలింపిక్స్‌లోనూ గెలవాలి. గెలిచే వరకూ గట్టిగా ప్రాక్టీస్ చెయ్యాలి. మొదటి స్థానంలో ఎవరు నిలిస్తే.. ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కి కూడా అనౌన్స్ చేశాను` అన్నారు. ఒలింపిక్స్ లో కూడా ఇదే మాదిరిగా విజయం సాధిస్తే, బ్రహ్మాండంగా సన్మానం చేయాలన్నది తన ఆశ, ఆశయం అని చంద్రబాబు చెప్పారు. ఇదే ఇష్యూని సాక్షి ఇంకోలా ప్రెజెంట్ చేసింది. ఒలింపిక్స్ కూ, నోబెల్ కూ లింక్ పెట్టడం విస్మయాన్ని కలిగిస్తోందని పేర్కొంది.
జనవరి 5వ తేదీన తిరుపతిలో చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. అప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఆంధ్రాకు చెందిన శాస్త్రవేత్తలు ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే… రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100 కోట్లు బహుమానంగా ఇస్తాం. నోబెల్ ఎలా సాధించాలనే ఉత్సుకతను ఇప్పట్నుంచే మీరు పెంచుకోవాలి. మీరు నోబెల్ సాధిస్తే రూ. 100 కోట్లు సంపాదించినట్టు అవుతుంది.’ అంటూ విద్యార్థుల్ని ప్రోత్సహించే క్రమంలో ఆ విధంగా మాట్లాడారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలకు అర్థంపర్థం లేని వ్యాఖ్యానాలు జోడించి.. ఇలా మీడియాను దిగజార్చేలా చేయడం ఎంత వరకూ సమంజసం!!