డీఎస్ కోసం తలుపులు తెరిచిన కాంగ్రెస్, బీజేపీ

డి.శ్రీనివాస్.. ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారుండరు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్ హవా ఓ రేంజ్ లో ఉండేది.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోవడంతో ఈయన ప్రభ కూడా తగ్గిపోయింది. దీంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. కారు పార్టీలో చేరినా పెద్దగా చురుగ్గా లేరు. ఈయన కుమారుడు అరవింద్ నిజామాబాద్ లో ఎంపీగా విజయం సాధించారు. బీజేపీ తరపున అరవింద్ గెలవడంతో డీఎస్ టీఆర్ఎస్ లో సైలెంటుగా ఉండిపోయారు. పేరుకే ఈయన కారు పార్టీలో ఉన్నా ప్లాన్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారని తెలుస్తోంది.

అయితే.. ఇటీవల కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ పార్టీలోకి రావాలంటే తమ పార్టీలోకి రావాలని డీఎస్ ను కోరుతున్నారు. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి..డీఎస్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్ ఆఫర్ ను డీఎస్ తిరస్కరించలేదు.. ఒప్పుకోలేదు.. చూద్దాంలే అన్నట్లు సమాధానమిచ్చారు. ఇపుడు హుజూరాబాద్ లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున విజయం సాధించిన ఈటల రాజేందర్ డీఎస్ ను కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి చాలాసేపు మంతనాలు జరిపారు. ఎప్పుడు డీఎస్ ను ప్రత్యేకంగా కలవని ఈటల సీనియర్ నాయకుడైన డీఎస్ ను కలిసి బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. కలిసి కార్యక్రమాలు చేస్తే కారు పార్టీకి చెక్ పెట్టవచ్చు అని చెప్పారట. అయితే ఈటలకు కూడా డీఎస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. మరి ధర్మపురి శ్రీనివాస్ బీజేపీలో చేరతారా.. పాత గూటికి చేరుతారా.. లేక కారు పార్టీలోనే అంటీముట్టనట్టు ఉంటారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.