జగన్ ఎంట్రీ ఎటు వైపు నుంచి..?

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే అంశంపై చర్చ నడుస్తోంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 7 నెలల తర్వాత అసెంబ్లీకి వస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే జగన్ ఎలా వస్తారు.. ఎటు వైపు నుంచి వస్తారు… వస్తే సభలో ఎంత సేపు ఉంటారు… ఏం మాట్లాడుతాడు… సభలో ఎలా వ్యవహరిస్తారు.. అనే ప్రశ్నలే ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే… ఏ ఇద్దరు మాట్లాడుకున్నా… ఓ వాట్సప్ గ్రూప్ చూసినా సరే… ఇదే అంశాలపై చర్చించుకుంటున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా కూడా రాలేదు. అప్పటి వరకు వై నాట్ 175 అని గొప్పగా చెప్పుకున్న జగన్… చివరికి 11 స్థానాలు మాత్రమే రావడంతో… అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం చెల్లలేదు. అయితే శాసనసభ్యునిగా ఎన్నికైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా స్పీకర్ ఎదుట ప్రమాణం చేయాలి. అందుకోసమని సభకు తొలిరోజే హాజరయ్యారు. ఆ సమయంలో ప్రత్యేక విజ్ఞప్తి ద్వారా మంత్రులు వచ్చే మార్గంలో అసెంబ్లీలోకి వచ్చారు. అలాగే అక్షర క్రమంలో కాకుండా… ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తర్వాత ప్రమాణం చేసేందుకు అనుమతించాలన్న వైసీపీ నేతల విజ్ఞప్తిని ప్రభుత్వం ఓకే చెప్పడంతో… సభలో తొలిరోజే ప్రమాణం చేసేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి సభలో కాలు పెట్టలేదు.

ఆ తర్వాత కూడా తనకు ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేసిన జగన్‌కు… కావాల్సిన సంఖ్యాబలం లేకపోవడంతో స్పీకర్ నిరాకరించారు. దీంతో హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తున్నారని… సీఎం చంద్రబాబుతో సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కుంటి సాకులు చెబుతూ… సభకు గైర్జాజరయ్యారు. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు… డిస్ క్వాలిఫై చేస్తామని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడు సభకు హాజరవుతున్నారు జగన్. దీంతో అందరి మదిలో ఒకటే ప్రశ్న… జగన్ ఎలా వస్తారు… ఏం చేస్తారు.. ఎలా వ్యవహరిస్తారు అని. వాస్తవానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు మాత్రమే గేట్ నంబర్ 1 నుంచి ఎంట్రీ ఉంటుంది. మిగిలిన సభ్యులందరికీ గేట్ నంబర్ 2 నుంచే ప్రవేశం.

జగన్ ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి హోదా తప్ప.. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ లేదు. కాబట్టి ఆయనకు గేట్ నంబర్ 1 నుంచి అనుమతి లేదు. ఇక మరో విషయం.. సభలో తొలిరోజు గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో ఇతరులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఇక రెండో రోజు నుంచి జగన్ వస్తాడా రాడా అనేది చూడాల్సి ఉంది. జగన్ తరఫున వైసీపీ సభ్యులు సభలో ఎలా వ్యవహరిస్తారో అని టీడీపీ నేతలే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మిర్చి రైతుల సమస్యలతో పాటు వైసీపీ నేతల అరెస్టులు, జగన్ సెక్యూరిటీ కుదింపు, గ్రూప్ -2 అభ్యర్థుల నిరసనలు, ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రస్తావన.. వంటి అంశాలపైనే వైసీపీ నేతలు సభలో ఆందోళన చేస్తారని కూటమి ప్రభుత్వ నేతలు భావిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు ధీటుగా జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు.