దేవుడు వరమిచ్చినా… పూజారి కరుణించటం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత… ఎక్కువగా సంబరాలు జరుపుకుంది తెలుగుదేశం పార్టీ నేతలే. ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడిన తమకు పార్టీ అండగా ఉంటుందని ఆశ పడ్డారు. అయితే కొందరు కిందిస్థాయి కార్యకర్తల తీరు…. ఐదేళ్లుగా కేసులు ఎదుర్కొన్న వారికి… ఎంతో వ్యయప్రయాసలతో కాలం గడిపారు. అలాంటి వారంతా తమ నేతను కలిసేందుకు ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారనేది బహిరంగ రహస్యం. పార్టీ గెలిచిన తర్వాత పనులు చేసే అవకాశం దొరికిందని కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే కొందరు కిందిస్థాయి కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యేల చుట్టూ ఉందే మందిమార్భాలం వల్ల ఇప్పుడు పార్టీకి, నేతకు కూడా చెడ్డపేరు వస్తుంది.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్యేకు చెందిన పీఏ సత్యనారాయణ తీరుపై స్థానిక టీడీపీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఎంతో కాలంగా ఎమ్మెల్యే దగ్గరే కొలువు చేస్తున్న సత్యనారాయణ… అన్ని రకాల వ్యాపారాల్లో వాటాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా నాటి ఎంపీ మార్గాని భరత్‌తో కలిసి ఇసుక అక్రమ రవాణా వ్యాపారం చేశారంటున్నారు టీడీపీ నేతలు. ఇక ఎమ్మెల్యేను కలవాలంటే… ముందుగా సత్యనారాయణ అనుమతి కావాల్సిందే. ఇక ఏదైనా పని కోసం ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరైనా అధికారులు వస్తే… పనికి తగినట్లుగా రేటు కడుతున్నారు. ఇదేంటి అంటే… ఎమ్మెల్యే గారి రేటు ఇది అని నేతకు కూడా అవినీతి మకిలి అంటిస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగి మొదలు… ఎమ్మార్వో స్థాయి వరకు ఎవరైనా సరే… సత్యనారాయణకు కప్పం కట్టాల్సిందే. అదేమంటే… పని మీది… కాబట్టి… ఇవ్వాల్సిందే అంటున్నారు. ఎమ్మెల్యేను కలిసేందుకు ఎవరైనా సాధారణ కార్యకర్తలు వస్తే.. పీఏ అనుమతి తప్పని సరి అనేది ద్వితీయ శ్రేణి నేతల మాట. రోజు వచ్చే వారితో ఎంతో మర్యాదగా మాట్లాడే పీఏ సత్యనారాయణ… ఎమ్మెల్యే గారితో పని కోసం వచ్చే వారిని మాత్రం గేటు దగ్గరే ఆపేస్తున్నారు. ఇలాంటి పీఏను ఎమ్మెల్యే తొలగించకపోతే పార్టీతో పాటు, ఆయన వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టపోతారని సీనియర్ ఎమ్మెల్యేకు సూచిస్తున్నారు. పెద్దాయన మంచోడే అయినప్పటికీ… పీఏ సత్యనారాయణ వ్యవహారంతో ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడు లేనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ద్వితీయ శ్రేణి నేతలు, అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.