ప్రభాస్ సినిమాకు అరుదైన రేటింగ్..!?

బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకు లేనంత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు డార్లింగ్. అదే ఊపులో వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ పోతున్నాడు ప్రభాస్. ఐతే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన చిత్రాలేవీ అనుకున్న స్థాయి విజయాలు సాధించలేదు. సుదీప్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా నటించిన “సాహూ” చిత్రం పరవలేదనిపించినా, ఆతరువాత అతను నటించిన “రాధే శ్యామ్”, “ఆదిపురుష్” చిత్రాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. ఈ జాబితాలో మనం ముఖ్యంగా చర్చించవలసిన చిత్రం ఆదిపురుష్. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడమే కాకుండా, ప్రేక్షకుల ఆగ్రహానికి కూడా గురయ్యింది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, హిందూ మతస్థుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉందని ఆరోపించారు ప్రేక్షకులు.

ఆదిపురుష్ విడుదల అయిన తరువాత ఎన్నో వివాదాలలో చిక్కుకొని, వార్తలలో నిలిచిన విషయం మనందరికీ తెలిసినదే. ఐతే తాజాగా ఈ చిత్రం మరోసారి చర్చనీయాంశం అయింది. వెండితెర పై విఫలమైన ఈ చిత్రం తాజాగా బుల్లితెరపై సత్తా చాటింది. ఆదిపురుష్ అర్బన్ రేటింగ్ 9.47 గా ఉండగా, అర్బన్ ప్లస్ రూరల్ లో 8.41 రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఒక మైథలాజికల్ చిత్రం అయ్యుండి కూడా బుల్లితెర పై ఇటువంటి రేటింగ్ సాధించడం మామూలు విషయం కాదంటున్నారు విశ్లేషకులు. ఐతే వెండితెర పై తమ అభిమాన హీరో చిత్రం విఫలం అవ్వడంతో నిరాశ చెందిన ప్రభాస్ అభిమానులకు, ఈ వార్త కాస్త ఊరట కలిగిస్తుందనే చెప్పాలి.

ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో “సాలార్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం మొదటిభాగం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రం రెండో భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రాబోతోందని సమాచారం. అదే సమయంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “ప్రాజెక్ట్ కే” చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.