మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్న విజయశాంతి..!

ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మూడేళ్ల క్రితమే మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె.. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ తో పోటాపోటీగా నటించి అలనాటి విజయశాంతిని మళ్లీ గుర్తు చేసింది. వాస్తవానికి రాజకీయాలలో బిజీగా ఉండే విజయ శాంతి అలా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. అయితే ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు విరామం తీసుకున్న ఈమె ఒక కొత్త సినిమాకు సంతకం చేసింది.

శుక్రవారం రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం డెవిల్ సినిమాతో బిజీగా ఉన్న నందమూరి కళ్యాణ్ రామ్ అంతలోనే తన కొత్త ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమా శుక్రవారం రోజున ప్రారంభం అయింది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే హైదరాబాదులో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవ్వగా.. విజయశాంతి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

ముహూర్తపు సన్నివేశానికి విజయశాంతి క్లాప్ కొట్టగా మురళీమోహన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇక భారీ బడ్జెట్ టెక్నికల్ వాల్యూస్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ చిలకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరొకవైపు కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.