ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ అందం కృతిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలలో నటించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ సక్సెస్ అందుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తూ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత కథల ఎంపిక విషయంలో తప్పటడుగు వేసిన ఈ ముద్దుగుమ్మ వరుసగా డిజాస్టర్ లను చవిచూసింది. ఇక చివరిగా వచ్చిన కస్టడీ సినిమా కూడా నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం కృతి శెట్టి.. శర్వానంద్ 35వ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా నిన్న ఆమె బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. అంతేకాదు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లడించారు. ఇదిలా ఉండగా కృతి శెట్టి తన అభిమానులను ఉద్దేశిస్తూ ఒక లాంగ్ నోట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.
కృతి శెట్టి ఇలా రాసుకుంటూ.. నా జీవితంలో మరో ఏడాదిలోకి అడుగు పెట్టాను. ఎన్నో విషయాలపై కృతజ్ఞతతో కూడా ఉన్నాను. ముఖ్యంగా సంతోషం, బాధ , ప్రేమ, ద్వేషం ఇలా అన్ని భావోద్వేగాలను నేను అనుభవించాను. అవన్నీ నన్ను ఈ రోజు ఈ స్థానంలో ఉండేలా చేశాయి. నాకెంతో సపోర్ట్ చేస్తూ నాలో స్ఫూర్తి నింపుతున్న నా కుటుంబానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నేను వేసే ప్రతి అడుగులో కూడా నన్ను ఆదరిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలు అంటూ కృతి శెట్టి సోషల్ మీడియా ఖాతాలో రాసుకుంది. ఇది కాస్త చాలా వైరల్ గా మారుతుంది.