ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు టూర్ కొనసాగుతుంది. బాబు షూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే రాయదుర్గం, కళ్యాణదుర్గంల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ రెండు చోట్ల సభలు సక్సెస్ అయ్యాయి. అయితే కళ్యాణదుర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు టిడిపిలో కలవరం పెంచుతుంది. అసలు మొదట నుంచి కళ్యాణదుర్గం టిడిపికి కంచుకోట.
గత ఎన్నికల్లో టిడిపిలో పోరు వల్ల వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి ఉషశ్రీ చరణ్ గెలిచారు. ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. అయినా సరే ఆమె మంత్రిగా మంచి పనితీరు కనబర్చడంలో విఫలమవుతున్నారు. అటు నియోజకవర్గంలో పెద్ద పాజిటివ్ లేదు. అయినా సరే ఇక్కడ టిడిపి అనుకున్న మేర బలపడటం లేదు. ఇక్కడ టిడిపి మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరీ, ఇంచార్జ్ ఉమా మహేశ్వరనాయుడు మధ్య పోరు నడుస్తోంది. దీని వల్ల టిడిపికి నష్టం జరుగుతుంది. తాజాగా బాబు పర్యటనకు ముందు కూడా రెండు వర్గాల మధ్య పంచాయితీ నడిచింది ఫ్లెక్సీల వివాదం కూడా కొనసాగింది.
ఈ క్రమంలో అధిష్టానం సర్దిచెప్పడంతో కాస్త తగ్గారు. ఇక బాబు టూర్ సక్సెస్ అయినా, నేతలు మళ్ళీ యథావిధిగా రచ్చ కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే పరిస్తితి కొనసాగిస్తే మళ్ళీ కళ్యాణదుర్గంలో టిడిపికి డ్యామేజ్ తప్పదు. ఎందుకంటే ఒకరికి సీటు ఇస్తే మరొక వర్గం సహకరించింది. దీని వల్ల పార్టీకి నష్టం. కాబట్టి ఆ ఇద్దరి నేతలని కలిపి సీటు ఒకరికి ఇచ్చి కలిసి పనిచేసేలా చేస్తేనే పార్టీ గెలుస్తుంది. లేదంటే అంతే సంగతులు.