వైసీపీకి తలనొప్పిగా మారిన చీరాల వర్గపోరు…!

ఓ వైపు రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్. అందుకు తగినట్లుగా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు జగన్. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రివ్యూ సమావేశంలో నేతలకు పలు సూచనలు కూడా చేశారు. 9 నెలలు కష్టపడితే… పార్టీకి, మీకు భవిష్యత్తు ఉంటుందన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొన్ని నియోజకవర్గాలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేయగా… టీడీపీ తరఫున పోటీ చేసిన కరణం బలరామ్ 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. అయితే అనూహ్యంగా ఆయన వైసీపీ కండువా కప్పుకోవడంతో… పరిస్థితి మారిపోయింది. నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచిగా మారిపోయింది. చివరికి మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ రెబల్ అభ్యర్థులను ఆమంచి పోటీలో నిలిపారు. అందులో 11 మంది గెలిచారు కూడా. పార్టీ గెలవడంతో… ఆమంచిపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి ఆమంచికి పర్చూరు నియోజకవర్గం బాధ్యతలు అప్పగించారు జగన్. ఇక చీరాల నుంచి రాబోయే ఎన్నికల్లో కరణం వెంకటేష్ పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చేశాడు.

అయితే తాజాగా వేటపాలెం మండలంలోని ఓ పంచాయతీ పరిధిలోని వార్డులకు జరుగుతున్న ఉప ఎన్నికల నామినేషన్ విషయం మరోసారి ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలను బయటపెట్టింది. నామినేషన్ దాఖలు చేసేందుకు పంచాయతీ కార్యాలయానికి వెళ్లిన ఆమంచి మనుషులపై కరణం వర్గం నేతలు దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే విచక్షణా రహితంగా కొట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న ఆమంచిపై కూడా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే విషయం ఇప్పుడు వైసీపీకి పెద్ద ఇబ్బందిగా మారింది. చీరాల నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.