నరసరావుపేట ఎంపీ టీకెట్ కోసం కొత్త పేరు…!

ఏపీలో ఎన్నికలకు ఇంకా 9 నెలలు సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ప్రధానంగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల కంటే కూడా… లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ అనే విషయం పైనే ఎక్కువగా చర్చ నడుస్తోందని చెప్పాలి. గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఓడిన వారిలో చాలా మంది పార్టీలు మారడం, నియోజకవర్గం మార్పు అంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఎన్నికల నాటికి ఎవరుంటారు… ఎవరు పోతారు అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ ప్రశ్నగానే మారింది.

ఉమ్మడి గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం తొలి నుంచి ఆసక్తికరంగానే మారింది. మాజీ ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. కోణిజేటి రోశయ్య, నేదురుమిల్్లి జనార్థన్‌రెడ్డి ఇక్కడ నుంచే పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. 2009లో టీడీపీ తరఫున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గెలవగా… 2014లో రాయపాటి సాంబశివరావు విజయం సాధించారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన లావు కృష్ణదేవరాయలు ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే 2024లో ఎవరు పోటీ చేస్తారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ తరఫున ఎన్నికైన లావు కృష్ణదేవరాయలుపైన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. ఎంపీ వల్ల నియోజకవర్గం పరిధిలో గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయని ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో ఆయన నియోజకవర్గం మారుతున్నారని కొందరు… పార్టీ మారుతున్నారని మరి కొందరు చెబుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి వైసీపీ తరఫున కొత్త అభ్యర్థి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఇక టీడీపీలో కూడా సేమ్ టూ సేమ్. 2014లో గెలిచిన రాయపాటి సాంబశివరావు… 2019లో ఓడారు. ప్రస్తుతం ఆయన వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనను మరోసారి ఎన్నికల గోదాలోకి దింపేందుకు చంద్రబాబు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. పైగా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా… ఆయనపై ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో రాయపాటి గురించి పార్టీలో ఆలోచన కూడా లేదనేది బహిరంగ రహస్యం. ఈ పరిస్థితుల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, టీటీడీ మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒక దశలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరు కూడా బలంగానే వినిపించింది. మరి అధినేత ఎవరికి అవకాశం ఇస్తాడో అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.