`బిజినెస్ మేన్` రీరిలీజ్ లాభాల‌న్నీ మ‌హేష్ కే ఇచ్చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆగష్టు 9న ఆయ‌న న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ బిజినెస్ మేన్ ను రీరిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. పూరీ జగన్నాధ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. 2012లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని.. మ‌ళ్లీ విడుద‌ల చేశారు. అయితే రీరిలీజ్ లోనూ ఈ సినిమా దుమ్ము దుమారం లేపింది.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు కొన్ని స్పెషల్ షోస్ వేయగా.. కాసుల వ‌ర్షం కురిపించింది. కేవ‌లం ఒక్క నైజాం లోనే ఏకంగా రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. చాలా ఏరియాల్లో బిజినెస్ మేన్ గత చిత్రాల రికార్డ్స్ ను చిత్తు చిత్తు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.42 కోట్లు.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 5.31 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను ద‌క్కించుకుంది. ఇక బిజినెస్ మేన్ రీరిలీజ్ లాభాల‌న్నీ మ‌హేష్ కే ఇచ్చేస్తున్నార‌ట‌.

అయితే అది ఆయ‌న సొంత ఖ‌ర్చుల‌కు వాడుకోవ‌డానికి కాదండోయ్. మ‌న సూప‌ర్ స్టార్ `మహేష్‌ బాబు ఫౌండేషన్‍` పేరుతో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న విషయం అంద‌రికీ తెలుసు. ఈ నేప‌థ్యంలోనే బిజినెస్ మేన్ నిర్మాత‌లు రీరిలీజ్ లో వ‌చ్చిన లాభాల‌న్నీ మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ కు విరాళంగా ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఈ డబ్బును అర్హులైన పాఠశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‍లు ఇచ్చేందుకు, పిల్లల గుండె ఆపరేషన్ల ఫండింగ్ కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ వినియోగించనుంది. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు బిజినెస్ మేన్ సినిమా నిర్మాత‌ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.