ఆదిలోనే ఎదురుదెబ్బ‌.. ధోనీ భాయ్ ఇక జాగ్ర‌త్త ప‌డ‌కుంటే చాలా క‌ష్టం!

ఇండియ‌న్ స్టార్ క్రికెట‌ర్ ఎమ్‌.ఎస్‌. ధోనీ, ఆయ‌న స‌తీమ‌ణి సాక్షి నిర్మాత‌లుగా మారిన సంగ‌తి తెలిసిందే. వీరి త‌మ హోమ్ బ్యాన‌ర్ ధోనీ ఎంట‌ర్టైన్‌మెంట్స్ పై ముందుగా ఓ త‌మిళ సినిమాను నిర్మించారు. అదే ‘ఎల్‌జీఎమ్‌’ (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌). ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హరీష్‌ కల్యాణ్‌, ఇవానా జంట‌గా న‌టించారు నదియా, యోగిబాబు కీల‌క‌ పాత్రల్ని పోషించారు.

ర‌మేష్ త‌మిళ‌మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం కోలీవుడ్ లో జూలై 28న విడుద‌లైంది. తెలుగులో మాత్రం `బ్రో` హవాను త‌ట్టుకోలేమ‌ని భావించి వారం రోజుల త‌ర్వాత ఆగ‌స్టు 4న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ధోనీ నిర్మాణంతో వ‌చ్చిన సినిమా అవ్వ‌డం వ‌ల్ల తొలి రోజు ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కు ప‌రుగులు పెట్టారు.

కానీ, అక్క‌డ వారికి చుక్క‌లే క‌నిపించాయి. ఇదేం సినిమా రా బాబు అంటూ ప్రేక్ష‌కులు త‌ల ప‌ట్టుకున్నారు. దాదాపు అందరి నుండి ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ధోనీ ఫ్యాన్స్ ను కూడా ఈ మూవీని తీవ్రంగా నిరాశ ప‌రిచింది. రెండో రోజు నుంచి ఈ మూవీకి ప్రేక్ష‌కులే క‌రువ‌య్యారు. మొత్తానికి సినీ ఇండ‌స్ట్రీలో నిర్మాత‌గా ధోనీకి ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలిగింది. ఈ నేప‌థ్యంలోనే నెటిజ‌న్ల‌ను క‌థ‌ల ఎంపిక‌లో ఇక నుండి అయినా జాగ్ర‌త్త ప‌డ‌కుంటే చాలా క‌ష్టం ధోనీ భాయ్ అంటూ స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తున్నారు.