బాలీవుడ్ స్టార్ హీరోయిన్, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలో ఈ బ్యూటీ నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మడు `జరా హాట్కే జరా బచ్కే` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింది.
విక్కీ కౌశల్ ఇందులో హీరోగా నటించారు. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విక్కీ కౌశల్, సారా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విక్కీ సారా గురించి ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. ఆమె ఎయిర్‌పోర్ట్ లో దొంగతనం చేసిందంటూ చెప్పుకొచ్చాడు.
అసలేం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో యాంకర్ `ఎప్పుడైన హోటల్ రూమ్స్ లో వస్తువులను దొంగిలించారా..?` అని ప్రశ్నించారు. అందుకే సారా `మేం ఒక నెల రోజుల నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీ ఉన్నాం. ఈ క్రమంలోనే పలు హోటల్స్ లో షాంపూ, కండీషనర్, లోషన్లు, టూత్‌పేస్ట్‌లను సేకరించాను` అంటూ ఓపెన్‌గానే చెప్పేసింది. ఇంతలోనే విక్కీ అందుకుని.. ప్రమోషన్ సమయంలో సారా ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రపోయేదని, ఓసారి ఎయిర్ పోర్ట్ లాంజ్ లో పడుకుని.. ఆ దిండును ఎత్తుకొచ్చేసిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు సారా మూడు రాష్ట్రాలకు ఆ దొంగిలించిన దిండును తీసుకెళ్లినట్టుగా విక్కీ వెల్లడించాడు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కోట్లకు వారసురాలు అయ్యుండి ఇదేం బుద్ధి సారా అంటూ సరదారా చురకలు వేస్తున్నారు.