కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో బలగం మూవీ గురించి ప్రశ్న.. ఏం అడిగారంటే..!

పెద్ద తారాగణం లేకుండా చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలైన బలగం సినిమా భారీ హిట్ సాధించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. బంధాలు, బంధుత్వాలు, ఆచారాలు అన్నీ కలగలిపిన సినిమాగా బలగం విడుదలై తెలుగు వారి హృదయాలు దోచేసింది. ఈ సినిమాను పల్లెటూర్లలో వందల మంది పోగయ్యి చూశారు. క్లైమాక్స్ లో ఒక పాట విని కంటతడి కూడా పెట్టుకున్నారు. ఈ మూవీని నిర్మించిన దిల్ రాజ్ కు కూడా భారీగా లాభాలు వచ్చాయి.

అంతేకాదు, ఈ సినిమాని చాలా అవార్డ్స్ కూడా వరించాయి. జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఈ మూవీ అవార్డులను గెలుచుకుంది. అయితే తాజాగా ఈ సినిమా గెలుచుకున్న ఒక అవార్డుకు సంబంధించి ఓ ప్రశ్నను కానిస్టేబుల్ పరీక్షలో అడిగారు. ఏప్రిల్ 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్‌లో బలగం సినిమాకి సంబంధించి అడిగిన ఆ ప్రశ్న ఏంటో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి చూపుతున్నారు. “మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఏ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది?” అని నిర్వహకులు ప్రశ్న అడిగారు. ఏకంగా పరీక్షలోనే సినిమా గురించి ప్రశ్న అడిగారంటే దీనికి ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ఇదొక ఆబ్జెక్టివ్ ప్రశ్న కాగా దీనికి నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. వాటిలో ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు సూపర్ పాపులర్ అయ్యారు.