ఆ కాలంలోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందిన తెలుగు సినిమాలు ఇవే


తెలుగు సినిమా ప్రేక్షకుల దృష్టంతా ఆస్కార్ అవార్డు సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలోని “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొని తెలుగు సినిమాకి ఎంతో గౌరవాన్ని తెచ్చి పెట్టింది. నిజానికి ఆర్ఆర్ఆర్ కంటే ముందే ఆస్కార్‌కి దాదాపు సమానమైన, ప్రతిష్టాత్మకమైన అవార్డులను సినిమాలు గెలుచుకున్నాయి. ఆ సినిమాలేంటి ఆ అవార్డులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

మల్లేశ్వరి

BN రెడ్డి దర్శకత్వంలో 1951లో వచ్చిన మల్లీశ్వరి 1953లో బీజింగ్ లో చైనీస్ సబ్ టైటిళ్లతో రిలీజ్ అయింది . ఆరోజుల్లో ఒక తెలుగు సినిమా చైనాలో 13 ప్రింట్లతో షోస్ పడటం అనేది ఊహకు కూడా అందని విశేషం. అంతేకాదు అదే సినిమా 16mm తెర మీద అమెరికాలో కూడా ప్రదర్శించ బడింది .

నర్తనశాల

1963 లో రిలీజైన నర్థనశాల బెంగాలీ,ఒడియా భాషల్లోకి సైతం డబ్ అయింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఇండోనేషియాలో జరిగిన ఆఫ్రో_ ఏషియన్ ఫెస్టివల్ లో రెండు అవార్డులను పొందింది. ఆ సినిమాలో కీచకుడు పాత్ర పోషించిన SV రంగారావుకు ఉత్తమ నటుడు అవార్డు లభిస్తే ఆర్ట్ డైరెక్టర్ TVS శర్మ కు ఆ విభాగంలో అవార్డ్ వచ్చింది.

ఎన్టీఆర్, ఏయాన్నార్ సినిమాలు

1960లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘నమ్మినబంటు’ సినిమాను  స్పెయిన్‌లో జరిగిన సాన్- సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అలాగే 1967లో రిలీజైన ఎన్టీఆర్ సినిమా ‘ఉమ్మడి కుటుంబం’ను భారత దేశం తరపున మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కు అధికారిక ఎంట్రీగా పంపారు.ఇక 1968 లో అయితే అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన సుడిగుండాలు బాపు తొలిసారి దర్శకత్వం వహించిన కృష్ణ నటించిన సాక్షి సినిమాలను తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో షో లు వేశారు. బాపు దర్శత్వంలోనే 1976 వచ్చిన సీతా కళ్యాణం సినిమాను లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ చికాగో ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లోనూ ప్రత్యేకంగా ప్రదర్శించడంతో పాటు బ్రిటీష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఒక పాఠం గా కూడా పెట్టారు.

క్షణక్షణం

రామ్ గోపాల్ వర్మ వెంకటేష్‌తో తీసిన ‘క్షణక్షణం’ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ అయింది. ఈ సినిమాను హిందీలోకి ‘హైరానా’ పేరుతో డబ్ చేశారు. ఎలాంటి హడావుడి లేకుండా క్లియర్ కట్ రోడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమా అమెరికాలోని మిచెగన్ రాష్ట్రం లో జరిగే ANN -ARBOR ఫిల్మ్ ఫెస్టివల్ , స్విట్జర్లాండ్ లో జరిగే FRIBOURG ఫిల్మ్ ఫెస్టివల్ ప్రశంసలు పొందింది. ఇంకా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన ఆస్కార్ మాత్రమే టాలీవుడ్‌ కు వచ్చిన అంతర్జాతీయ అవార్డ్ గా భావించలేం. కానీ, ‘నాటు నాటు’కు వచ్చిన ఆస్కార్ అవార్డ్ రీసౌండ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని అవార్డుల కంటే ఘనంగా వినబడుతుంది.