లోకేష్‌తో చిత్తూరులో మైలేజ్..ఆధిక్యం లేనట్లే!

దాదాపు నెలన్నర రోజులు పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే నారా లోకేష్ పాదయాత్ర జరిగిన విషయం తెలిసిందే. జనవరి 27న మొదలైన పాదయాత్ర..మార్చి 11న తంబళ్ళపల్లె వద్ద బ్రేకు పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ పడింది. అయితే తంబళ్ళపల్లెలో చిత్తూరులోని అన్నీ స్థానాలు లోకేష్ కవర్ చేసేశారు. ఈ జిల్లాలోనే 14 స్థానాలు కవర్ అయ్యేలా లోకేష్ పాదయాత్ర జరిగింది..మిగిలిన జిల్లాల్లో మాత్రం అన్నీ స్థానాలు కవర్ అయ్యేలా పాదయాత్ర ఉండదు.

అయితే చిత్తూరు చంద్రబాబు సొంత జిల్లా కావడంతోనే అన్నీ స్థానాలు కవర్ చేశారని చెప్పవచ్చు. పైగా చంద్రబాబు సొంత జిల్లా అయినా సరే ఇక్కడ పూర్తి డామినేషన్ వైసీపీదే ఉంది. అందుకే వైసీపీ హవా తగ్గింది టి‌డి‌పి బలం పెంచడం కోసం లోకేష్ పాదయాత్ర పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. మరి లోకేష్ పాదయాత్ర వల్ల చిత్తూరులో టి‌డి‌పి బలం ఏమైనా పెరిగిందా? అంటే కొంతమేర మాత్రం ప్రయోజనం ఉందనే చెప్పాలి. పాదయాత్ర మొదట్లో అంత బాగా క్లిక్ అవ్వలేదు గాని..నిదానంగా మైలేజ్ పెరిగింది.

దీంతో కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి కాస్త ఊపు వచ్చింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా చిత్తూరులో టి‌డి‌పి కొంతమేర బలపడిందని తెలిసింది. జిల్లాలో 14 స్థానాలు ఉంటే వైసీపీ 8, టి‌డి‌పి 4 స్థానాలు గెలుచుకుంటుందని, 2 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

అయితే గత ఎన్నికల్లో వైసీపీ 13, టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు కాస్త సీన్ మారుతుంది. టి‌డి‌పి మదనపల్లె, నగరి, పలమనేరు, కుప్పం స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని, పీలేరు, శ్రీకాళహస్తిలో ఇంకాస్త కష్టపడితే గెలవచ్చు అని సర్వేలు చెబుతున్నాయి. అంటే 6 స్థానాలు వరకు గెలిచే ఛాన్స్ ఉంది. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే తిరుపతి, చిత్తూరు స్థానాల్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తానికి లోకేష్ పాదయాత్ర వల్ల చిత్తూరులో టి‌డి‌పికి కాస్త ప్లస్ అయింది.  కానీ లీడ్ మాత్రం వైసీపీదే.