జగన్ వ్యూహం..చిక్కని బాబు-పవన్!

ఏపీ రాజకీయాల్లో సి‌ఎం జగన్ వ్యూహాలు ఊహించని విధంగా ఉంటాయి. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ఆయన వేసే స్ట్రాటజీలు మామూలుగా ఉండవు. అలాగే ప్రజల్లో సానుభూతి వచ్చేలా మాట్లాడటంలో జగన్‌ని మించిన వారు లేరనే చెప్పాలి. తనదైన శైలిలో సెంటిమెంట్ లేపడంలో జగన్ రాజకీయమే వేరు. ఇటీవల కూడా ఆయన తాను ఒంటరి వాడినని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తోడేళ్లు లాంటి చంద్రబాబు, పవన్ కలిసొస్తున్నారని అంటున్నారు.

తాజాగా తెనాలి సభలో కూడా అదే తరహాలో మాట్లాడారు. అలాగే బాబు-పవన్‌కు తెలివిగా ఓ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే బాబు-పవన్ 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జగన్ ఈ సవాల్ చేశారని చెప్పవచ్చు. అంటే ఇటు టి‌డి‌పిని 175, అటు జనసేనని 175 స్థానాల్లో పోటీ చేయాలని అంటున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకోకుండా ఎవరికి వారు విడిగా పోటీ చేయాలని జగన్ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ వెనుక పెద్ద రాజకీయ కోణం ఉంది..అది ఏంటంటే..రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి తమకు బెనిఫిట్ అవుతుందనేది జగన్ కోణం.

గత ఎన్నికల్లో కూడా అదే జరిగింది. టి‌డి‌పి-జనసేన సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో వారు కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అదే జరిగితే వైసీపీకి నష్టం జరగడం తప్పదు. అందుకే టి‌డి‌పి-జనసేనల మధ్య పొత్తు ఉండకూడదని చెప్పి జగన్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు.

జగన్ ఎన్ని వ్యూహాలు వేసిన సరే బాబు-పవన్ చిక్కుకునేలా లేరు. గత ఎన్నికల్లో ఆ వ్యూహాలకు దెబ్బతిన్నారు. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. కాబట్టి జగన్ ఎన్ని ఎత్తులు వేసిన ప్రయోజనం లేదు.