వాలంటీర్లపైనే భారం..వైసీపీకి కలిసొస్తుందా?

వైసీపీకి వాలంటీర్లే పెద్ద బలంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు వారు చేతుల్లోనే ఎమ్మెల్యేల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలు చూసిన, ఏ మంత్రి చూసిన వాలంటీర్ల నామస్మరణ చేస్తున్నారు. పైగా వారి ఓట్లు పై కూడా డౌట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే పదే పదే టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లని తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. అంటే వాలంటీర్లు మొత్తం వైసీపీ వైపే ఉండేలా మాట్లాడుతున్నారు.

అదే సమయంలో వాలంటీర్లు ప్రతి ఓటరు వైసీపీకి మద్ధతు ఇచ్చేలా చేయాలని చెప్పి వైసీపీ నేతలు కోరుతున్నారు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం..వాలంటీర్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. “చంద్రబాబు వస్తే మొదటి ఫైరింగ్‌ ఎవరిపైనో తెలుసా? వాలంటీర్‌ పైనే. ఆయనే పేల్చడం ఎందుకు.? మనమే పేల్చేద్దాం. తుపాకీ మన వద్దనే ఉంది’’ అంటూ ధర్మాన అన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఓటు వేయాలో.. దేనికి వేయకూడదో.. వాలంటీరు చెప్పకూడదని ఎవడు చెప్పాడని ఫైర్ అయ్యారు.

అంటే వాలంటీర్లు ఓటర్లని వైసీపీకి ఓటు వేసేలా చేయాలని ధర్మాన చెబుతున్నారు. ఇక ధర్మాన చెప్పేది ఏముంది..ఎలాగో వాలంటీర్లు చేసే పని అదే అని, పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పలు చోట్ల ఓటర్లని బెదిరించి..వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయని చెప్పి..ఆ పార్టీని ఎలా గెలిపించారో తెలుసని ప్రతిపక్షాలు అంటున్నాయి.

ఇప్పుడు అలాగే బెదిరిస్తారని..కానీ ఓటర్లు వైసీపీ వైపు నిలబడతారో లేదో చూడాలి అని అంటున్నారు. అప్పుడంటే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు వేరే ఆప్షన్ లేదని, కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చేసి ఓటు ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి..వాలంటీర్లు బెదిరించిన ప్రజలు లొంగుతారా? అనేది చూడాలి అని అంటున్నారు.