ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే రాజీనామాలే..బాబుకు వార్నింగ్!

రాజేష్ మహాసేన టీడీపీలో చేరే విషయంలో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజేష్ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అటు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 15న చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో 16న చంద్రబాబు సమక్షంలో రాజేశ్ టీడీపీలో చేరనున్నారు. అయితే రాజేశ్ మహాసేనని టీడీపీలో చేర్చుకోవద్దని, జిల్లాలోని కొందరు తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు లెటర్ రాశారు.

గత ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి పనిచేశారని..వైసీపీ కోసం పని చేసి ఆ తర్వాత ఆయన మనసు మార్చుకుని వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టి‌డి‌పి-జనసేనలకు మద్ధతు ఇస్తున్నారు. అయితే ఆ మధ్య జనసేనలో చేరుతున్నానని రాజేష్ ప్రకటించారు. కానీ ఏం జరిగిందో గాని ఆ పార్టీలోకి వెళ్లలేదు. తనని చేర్చుకునే ఉద్దేశం జనసేనకు లేదనుకుంటా అని చెప్పి..టి‌డి‌పిలోకి రావడానికి రెడీ అయ్యారు. ఇదే క్రమంలో తూర్పులోని టి‌డి‌పి పెద్దలని కలిశారు. యనమల రామకృష్ణుడు, రాజప్ప, వరుపుల రాజా, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాంటి నేతలతో తాజాగా రాజేష్ భేటీ అయ్యారు.

దీంతో ఆయన టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఇదే క్రమంలో కొందరు టి‌డి‌పిలోని దళిత నేతలు..రాజేష్‌ని పార్టీలో చేర్చుకోవద్దని లేఖ రాశారు. గతంలో చంద్రబాబు, నారా లోకేష్ పై మహాసేన రాజేష్ అనేక ఆరోపణలు చేశారని, చాలామంది దళితులను తమ పార్టీకి దూరం చేశారని టీడీపీ దళిత ఐక్యవేదిక నాయకులు గుర్తు చేశారు. వైసీపీలో కొద్దిరోజులు పని చేశారని, జనసేనలో చేరాలనుకుని చివరికి టీడీపీలో చేరుతున్నారని, ఆయన ఏదో ఆశించే టీడీపీలో వస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాలుగా తాము ఏమీ ఆశించకుండా టీడీపీలో పనిచేస్తోన్నామని చెప్పారు. ఒకవేళ ఆయనని పార్టీలో చేర్చుకుంటే తాము పార్టీకి రాజీనామా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చూడాలి మరి రాజేష్‌ని టీడీపీలో చేర్చుకుంటారో లేదో.