టీడీపీని వదలని వీర్రాజు..పవన్ తేల్చుకోవాల్సిందే.!

ఏపీలో పొత్తుల అంశంలో బీజేపీ చాలా క్లారిటీగా ఉన్నట్లుగా కనిపిస్తుంది…కలిసొస్తే జనసేనతో పొత్తు ఉంటుందని, లేదంటే ప్రజలతోనే తమ పొత్తు అని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అంటే జనసేన కలిస్తే ఓకే లేకపోయినా ఓకే అన్నట్లు అన్నారు. అదే సమయంలో మళ్ళీ టీడీపీతో కలిసే ప్రశక్తి లేదని గట్టిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఒకవేళ జనసేన గాని టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అయ్యి, బీజేపీ కలవాలని చూస్తే…బీజేపీ ఒప్పుకునేలా లేదు.

అప్పుడు జనసేనని సైతం పక్కన పెట్టడానికి కూడా బీజేపీ వెనుకాడటం లేదనే చెప్పాలి. ఎటు చూసుకున్న బి‌జే‌పి ఒంటరిగా ముందుకెళ్లడానికే రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒంటరిగా వెళ్ళి ఒక శాతం ఓట్లు తెచ్చుకుంటారా? ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారా? అనేది చూడాలి. కానీ బీజేపీ నేతలు టీడీపీపై చేస్తున్న విమర్శలు బట్టి చూస్తే..ఖచ్చితంగా పొత్తు లేదనే తెలుస్తోంది. సోము వీర్రాజు లాంటి వారు అధికార వైసీపీ కంటే ముందు టీడీపీనే ముందు విమర్శిస్తున్నారు.

తాజాగా కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీతో తాము కలిసే ప్రసక్తే లేదని వీర్రాజు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఉన్నవి కుటుంబ పార్టీలని, ఈ రెండు పార్టీలను రాజకీయ ముఖచిత్రం నుంచి దూరం చేయడమే బీజేపీ లక్ష్యమని, అధికారం కోసం టీడీపీ, వైసీపీ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నాయని, తమ ఫోన్లూ ట్యాపింగ్‌ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదని అన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చేశామని, దానికి సంబంధించి ఆయన రూ.15 వేల కోట్లు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే పొత్తు లేకపోతే లేదు గాని..అధికారంలో ఉన్న వైసీపీ ఫోన్ ట్యాపింగ్ విమర్శలు వస్తుంటే..ప్రతిపక్ష టీడీపీపై సైతం ట్యాపింగ్ చేస్తుందని వీర్రాజు విమర్శించడమే ఆశ్చర్యం. ఇక హోదా లేదు..దానికి తగ్గట్టు ప్యాకేజ్ ఇస్తామంటే అప్పుడు చంద్రబాబు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు హోదా ఇచ్చామని వీర్రాజు కవర్ చేస్తున్నారు. అసలు ప్యాకేజ్ కూడా పూర్తిగా ఇవ్వని పరిస్తితి. మొత్తానికి పొత్తుపై వీర్రాజు తేల్చేశారు..ఇంకా పవన్ తేల్చుకోవాల్సి ఉంది.