మంగళగిరిపై లోకేష్ గ్రిప్..వైసీపీ కొత్త ప్లాన్!

గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి నారా లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. అధికారంలో లేకపోయినా సరే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు అండగా ఉంటున్నారు. రోడ్లు వెయిస్తున్నారు..పేద ప్రజలకు కొన్ని పథకాలు కూడా ఇస్తున్నారు. ఇలా తన బలాన్ని పెంచుకుంటున్నారు.

అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది..ఆ విషయం సర్వేల్లో స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు అక్కడ టీడీపీని దెబ్బకొట్టేలా వైసీపీ ప్లాన్స్ ఉంటున్నాయి. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలని వైసీపీలోకి లాగిన విషయం తెలిసిందే. అలాగే ఇక్కడ చేనేత వర్గంతో రాజకీయం చేస్తూ..వచ్చే ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన గంజి చిరంజీవులుని బరిలో దింపాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే ఎవరు బరిలో దిగిన గెలవాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. పైగా జనవరి 27 నుంచి పాదయాత్ర ఉండటంతో ఇప్పుడు ఎక్కువ సమయం మంగళగిరిలోనే గడుపుతున్నారు.  అక్కడ ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఇక తాజాగా వైసీపీకి చెందిన కీలక నేత  కాండ్రు శ్రీనివాసరావుని టీడీపీలోకి తీసుకొచ్చారు. ఈయన గత ఎన్నికల్లో ఆర్కే గెలుపు కోసం కృషి చేశారు. ఇక చేనేత వర్గానికి చెందిన కాండ్రు టీడీపీలోకి రావడం ప్లస్ అవుతుంది. అయితే మంగళగిరిలో ఇప్పుడు లోకేష్‌కు అనుకూలమైన వాతావరణం ఉంది.

కానీ ఆయన పాదయాత్రకు వెళ్ళాక..మంగళగిరిపై ఫోకస్ పెట్టి..అక్కడ టీడీపీని దెబ్బకొట్టాలనే ప్లాన్ తో వైసీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీని వీక్ చేసి మళ్ళీ అక్కడ గెలవాలని చెప్పి వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. మరి వైసీపీ వ్యూహాలు ఏ మేర వర్కౌట్ అవుతాయో చూడాలి.