రాజుగారి సర్వేలు..లగడపాటి కాదు కదా..!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..ఢిల్లీలో ఉంటూ ఏపీలోని అధికార వైసీపీపై ఏ స్థాయిలో ఫైర్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం అనేక తప్పులు చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇక టీడీపీ-జనసేనలకు అనుకూలంగా రఘురామ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని, ఆ పొత్తులోనే తాను పోటీ చేస్తానని రాజు గారు చెప్పుకొస్తున్నారు.

ఇదే క్రమంలో ఎప్పటికప్పుడు తాను సొంతంగా సర్వేలు నిర్వహిస్తున్నానని, ఆ సర్వే వివరాలని ఎప్పటికప్పుడు మీడియా ముందు చెబుతున్నారు. టీడీపీ-జనసేన కలిసి సత్తా చాటడం ఖాయమని, అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. ఇటీవలే ఓ సర్వేని బయటపెట్టారు. ఆ రెండు పార్టీలు కలిసి 12శాతం నుంచి 14 శాతం ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అన్నారు. ఉత్తరాంధ్రలో 10 శాతం నుంచి 12 శాతం టీడీపీ, జనసేనలకు ఎడ్జ్ ఉంటుందని, ఉభయగోదావరి జిల్లాలలో 14 శాతం నుంచి 16శాతం.. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12 శాతం నుంచి 14 శాతం.. ఒంగోలు నెల్లూరులలో 8 శాతం నుంచి 10శాతం, కడప-చిత్తూరులలో 6 శాతం నుంచి 8 శాతం.. అనంతపురం, కర్నూలులలో 10 శాతం నుంచి 12శాతం టీడీపీ, జనసేన కూటమికి ఎడ్జ్ ఉందని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో టీడీపీ, జనసేనలకు కలిపి తక్కువలో తక్కువ 145 సీట్లు వస్తాయని లెక్కలు చెప్పారు. వైఎస్సార్‌సీపీకి 30 సీట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే రాజు గారి సర్వేలు నిజమైతే పర్లేదు..అలా కాకుండా లగడపాటి రాజగోపాల్ సర్వేల మాదిరిగా అయితే ఇంకా రాజుగారి పరువు కూడా గోవిందా అని అంటున్నారు.