`ద‌స‌రా` టీజ‌ర్ వ‌చ్చేసింది.. ఊర‌మాస్ అంతే!

న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల‌ను పోషించారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

మార్చి 30న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా ఈ చిత్రం విడుద‌ల కానుంది. అయితే తాజాగా మేక‌ర్స్ ద‌స‌రా టీజ‌ర్ ను ఐదు భాష‌ల్లోనూ బ‌య‌ట‌కు వ‌దిలారు. పది తలల రావణాసుడి కటౌట్ తో ట్రైలర్ మొదలైంది. `ఈర్లపల్లి.. సుట్టూరా బొగ్గు కుప్పలు..తొంగి జూత్తెగానీ కనిపియ్యని ఊరు..` అంటూ నాని డైలాగ్ తో కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

గోదావరిఖని కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. `మందంటే మాకు వ్యసనం కాదు.. అలవాటు పడిన సంప్రదాయం.. నీ యవవ్వ ఎట్లైతే గట్లాయె గుండు గుత్తగ లేపేద్దాం బాంచ్చెత్..` అంటూ నాని చెప్ప‌డం కేక పెట్టింది. పక్కా పల్లెటూరి మాస్ డైలాగ్స్ తో సినిమా టీజర్ ఊర మాస్ గా ఉంది. నాని మేకోవ‌ర్‌, విజువ‌ల్స్ ఆక‌ట్టుకున్నాయి. మొత్తానికి అదిరిపోయిన ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను ఈ సినిమా రీచ్ అవుతుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.