బాబు-పవన్‌తో జగన్‌కు మేలు?నిజమెంత?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే…టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. ఇక తాజా భేటీపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ఓ వైపు వారు కలవడంపై విమర్శలు చేస్తూనే..మరో వైపు వారిద్దరు కలిసొస్తే జగన్‌కు మేలు అని, మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే చంద్రబాబు-పవన్ కలిసి ఎన్నికల బరిలో దిగితే నిజంగానే జగన్‌కు మేలు జరుగుతుందా? వైసీపీ నేతల మాటల్లో నిజముందా? అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్తితులని చూస్తుంటే…వైసీపీ నేతలు పైకి చంద్రబాబు-పవన్‌లపై విమర్శలు చేస్తున్నారు గాని..వారు కలవడం వల్ల కొంతవరకు వైసీపీకి నష్టం జరుగుతుందనే అంశం వైసీపీ నేతలకు క్లారిటీ ఉంది.

ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే..2014 ఎన్నికల్లో బాబుకు పవన్ సపోర్ట్ చేయడం వల్ల వైసీపీని ఓడించి అధికారంలోకి రాగలిగారు. అదే సమయంలో గత ఎన్నికల్లో టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి మేలు జరిగింది. దాదాపు 50 సీట్లలో జనసేన ఓట్లు చీల్చి..టీడీపీకి నష్టం చేసి..వైసీపీ గెలిచేలా చేసిందని చెప్పవచ్చు.

అంటే ఆ స్థానాల్లో టీడీపీపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. అప్పుడే టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి ఉంటే..గెలవడం పక్కన  పెడితే..వైసీపీకి 151 సీట్లు మాత్రం వచ్చేవి కాదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు వారు కలిసి పోటీ చేస్తే ఎంతోకొంత వైసీపీకి నష్టమే. పైగా గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉంది..ఇప్పుడు వ్యతిరేక గాలి వస్తుంది. కాబట్టి బాబు-పవన్ కలవడం వల్ల జగన్‌కు మేలు కంటే నష్టమే ఎక్కువ.