పవన్ బస్సు యాత్రపై వైసీపీలో టెన్షన్..!

మరికొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా తాను యాత్రకు సిద్ధం చేసిన బస్సు ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టారు. పూర్తి సెక్యూరిటీలో ఉన్న బస్సుకు వారాహి అని పేరు పెట్టి..ఎన్నికల యుద్ధానికి సిద్ధమని పవన్ క్యాప్షన్ పెట్టారు. అయితే ఇందులో విమర్శలు చేయడానికి ఏమి లేదు..కానీ ఓ విషయాన్ని వైసీపీ గట్టిగా పట్టుకుంది.

అది ఏంటంటే..వారాహి బస్సు కలర్..అది ఆలీవ్ గ్రీన్ కలర్‌లో ఉంది..అంటే మిలటరీ వాహనాన్ని పోలి ఉంది..దీనిపై వైసీపీ నేతలు, శ్రేణులు విమర్శలు చేస్తున్నారు. మిలటరీ వాహనం కలర్ వేస్తే పర్మిషన్ ఉండదనే సంగతి పవన్ తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.  మిలటరీ వినియోగించే ఆలివ్‌ గ్రీన్‌ను వేయకూడదని, ఇది నిషేధిత రంగు అని పవన్‌ కల్యాణ్‌కు తెలియదా? పేర్ని నాని ప్రశ్నించారు. మాటిమాటికీ తెలుపు రంగో మరొకటో మార్చుకోవడం కంటే ఏకంగా వారాహికి పసుపు రంగే వేసుకుంటే భవిష్యత్తులోనూ పవన్‌కు ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు.

అయితే వైసీపీ నేతల విమర్శలపై జనసేన నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి..ప్రభుత్వ బిల్డింగులకు పార్టీ రంగులు వేసే వైసీపీ వాళ్ళు కూడా రంగులు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్ అవుతున్నారు. అటు పవన్ సైతం ఆలీవ్ గ్రీన్ కలర్ లో ఉన్న కార్లు, బైకుల ఫోటోలని పెట్టి వైసీపీని ప్రశ్నించారు. అసలు కనీసం ఆలీవ్ గ్రీన్ షర్ట్ వేసుకోవచ్చా…సరే అసలు ఊపిరి అయిన తీసుకోవచ్చా? అని నిలదీశారు.

మొత్తానికి వారాహి బస్సు రంగుపై పెద్ద ఎత్తున రచ్చ నడుస్తోంది. అయితే పవన్ బస్సు యాత్ర మొదలుకాకముందే..వైసీపీలో టెన్షన్ మొదలైందని విమర్శలు వస్తున్నాయి. బస్సు రంగు పై అభ్యంతరాలు ఉంటే రవాణా శాఖ వారు చూసుకుంటారని, ఈలోపే వైసీపీ విమర్శలు మొదలుపెట్టిందని, ఇక బస్సు యాత్ర చేస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో అని జనసేన శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.