సీమ గర్జనతో వైసీపీకి మైలేజ్ పెరిగిందా?

అధికార వైసీపీ..మూడు రాజధానుల నినాదంతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంలో రాజకీయ పరమైన మైలేజ్ దక్కించుకోవడానికి వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. అయితే అధికారంలో ఉండి కూడా మూడు రాజధానుల అమలులో ఇబ్బందులు పడుతుంది. న్యాయపరమైన సమస్యలు, చిక్కులతో ముందుకెళ్లడం లేదు. పైగా మూడు రాజధానులని ప్రకటించి మూడేళ్లు అయినా సరే..ఇంతవరకు అమలు లేదు.

దీంతో వైసీపీ తీరుపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేవలం రాజకీయ పరంగానే ఈ అంశంలో వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ స్ట్రాటజీ మార్చేసింది. అధికారంలో ఉంటూ కూడా మూడు రాజధానుల అంశంపై పోరాట బాట పట్టింది. మరి ఎవరిపై పోరాడుతుందో అర్ధం అవ్వని విషయం. కాకపోతే ఈ మూడు రాజధానుల పేరిట ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలపై ఎక్కువ ఫోకస్ చేసి, ఆ ప్రాంతాల్లో సెంటిమెంట్ లేపడానికి చూస్తుంది. ఇదే క్రమంలో విశాఖ గర్జన పేరుతో ర్యాలీ చేశారు.

కర్నూలులో వైసీపీ రాయలసీమ గర్జన.. ఎవరిని మోసం చేయడానికి?

తాజాగా కర్నూలు రాయలసీమ గర్జన సభ ఏర్పాటు చేశారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఈ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రజల నుంచి భారీ స్పందన రాలేదు. కాకపోతే సభని సక్సెస్ చేయడానికి జనాలని తరలించే ప్రయత్నాలు చేశారు. కానీ సభ పూర్తి అయ్యేవరకు జనం సభలో ఉండలేదు.

ఇక సభ వేదికగా వైసీపీ నేతలు కర్నూలులో హైకోర్టు కావాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రతిపక్షంలో చంద్రబాబుని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టుకు బాబు అనుకూలమో కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ డిమాండ్ బాగానే ఉంది గాని..ఈ మూడున్నర ఏళ్ళు అధికారంలో ఉండి రాయలసీమలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటని టీడీపీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే అని..ఇప్పుడు అభివృద్ధి శూన్యమని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి సీమ గర్జన ద్వారా వైసీపీకి ఒరిగింది ఏమి లేదు.