అనంతలో వైసీపీకి కష్టాలు..పెద్దిరెడ్డి ఎంట్రీ..!

తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలో టీడీపీకి ఎప్పుడు మంచి ఫలితాలే వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే టీడీపీ బాగా నష్టపోయింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 గెలుచుకుంటే, టీడీపీకి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అందుకే ఈ సారి ఎన్నికల్లో మాత్రం అలాంటి ఫలితాలు రాకూడదని చెప్పి టీడీపీ కష్టపడుతుంది. ఈ సారి జిల్లాలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలని టీడీపీ నేతలు కష్టపడుతున్నారు.

అయితే అటు వైసీపీకి ఏమో కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. సొంత పార్టీ నేతలు చేసే తప్పిదాలే వైసీపీకి పెద్ద మైనస్ గా మారుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తుండగా, మరికొన్ని చోట్ల వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు పెరిగిపోయాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద  మైనస్ గా మారాయి. ప్రస్తుతం జిల్లాలో చూసుకుంటే కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీచరణ్‌పై నెగిటివ్ కనిపిస్తోంది. మంత్రి అనుచరులపై భూ కబ్జాల ఆరోపణలు వచ్చాయి.

అటు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వల్లే జాకీ సంస్థ తరలివెళ్లిపోయిందని టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేయడం మైనస్ అయింది. అటు ఎమ్మెల్యే సోదరుడు..చంద్రబాబు, లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీకి డ్యామేజ్ గా మారాయి. కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, రాయదుర్గం, శింగనమల ఎమ్మెల్యీలకు పెద్ద పాజిటివ్ కనిపించడం లేదు. అటు తాడిపత్రిలో జరిగే రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు భారీ నెగిటివ్ ఉంది.

ఇలా జిల్లాలో వైసీపీకి కష్టాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో జిల్లా పర్యటనకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వస్తున్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి పార్టీ పరిస్తితులని చక్కదిద్దాలని చూస్తున్నారు. మొదట కళ్యాణదుర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలుకానుంది. మరి పెద్దిరెడ్డి అనంతలో వైసీపీని ఎలా లైన్ లో పెడతారో చూడాలి.