నెక్స్ట్ ఎన్నికల్లో వారసులకు సీట్ల విషయంలో జగన్ చాలా క్లారిటీగా ఉన్నారు..ఇప్పటికే వారసులకు సీటు ఇవ్వనని చెప్పేశారు. మళ్ళీ తనతో మీరే పోటీ చేయాలని సీనియర్ ఎమ్మెల్యేలకు చెప్పేశారు. అయినా సరే కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు..తమ వారసులని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు విరమించడం లేదు. కొందరు అనారోగ్య కారణాలు, మరొకరు వయోభారం వల్ల పోటీ చేయలేమని, తమ బదులు తమ వారసులు పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఎమ్మిగనూరు ఎమ్మెలి చెన్నకేశవ రెడ్డి లాంటి వారు పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. తన వారసుడుకు సీటు ఇవ్వాలని కోరారు. అటు పేర్ని నాని సైతం తన వారసుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు.
ఇదే క్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొందరు రెడ్డి నేతల వారసులు సీట్ల వేటలో ఉన్నారు. ఇందులో మొదటిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వారసుడు ప్రణీత్ రెడ్డి సీటు కోసం తెగ ట్రై చేస్తున్నారు. బాలినేని ఎలాగో ఒంగోలు బరిలో ఉంటారు..ఇక తన తనయుడుకు వేరే సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అటు వైవీ సుబ్బారెడ్డి సైతం తన తనయుడు విక్రాంత్ రెడ్డి కోసం ట్రై చేస్తున్నారు. ఈయన దర్శి సీటుపై ఫోకస్ పెట్టారు.
అటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి..తన రాఘవరెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. అందుకోసం దర్శి, గిద్దలూరు, మార్కాపురం సీట్లపై కన్నేశారు. ఈ సీట్లలో ఏదొకటి దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు దర్శి సీటు కోసం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కాచుకుని ఉన్నారు. ఎక్కువ నేతలు దర్శి సీటుపైనే ఫోకస్ పెట్టారు.
ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్‌కు సీటు ఇవ్వరని ప్రచారం జరుగుతుంది. పైగా ఇక్కడ రెడ్డి వగ్రమ్ ఓట్లు ఎక్కువ. అందుకే ఈ సీటు దక్కించుకుంటే తమ వారసులకు గెలుపు ఈజీగా వస్తుందని నేతలు భావిస్తున్నారు. మరి ఏ వారసుడుకు జగన్ సీటు ఇస్తారో చూడాలి.