రాధా లొంగట్లేదా..కొడాలి ప్రయత్నాలు విఫలమేనా..!

వంగవీటి రంగాని ఒక పార్టీ మనిషి చూడటానికి లేదు..కాపు సామాజికవర్గానికి ప్రతినిధిగా పనిచేసి..వారికి అండగా నిలిచిన రంగా..అభిమానులు అన్నీ పార్టీల్లోనూ ఉన్నారు. అయితే రంగా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్న ఆయన తనయుడు రాధా సైతం రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. కాపులకు అండగా ఉంటూ ముందుకెళుతున్నారు. అధికారికంగా టీడీపీలో ఉన్నప్పటికి..అన్నీ పార్టీల నేతలతో రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఇదే క్రమంలో వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు రాధాకు మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. అయితే రాధా వైసీపీ వదిలి టీడీపీలోకి వెళ్ళినప్పటి నుంచి..ఆయన్ని మళ్ళీ వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి,వంశీలు ట్రై చేస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో పలు కార్యక్రమాల్లో కలిశారు. తాజాగా కూడా రంగా వర్ధంతి సందర్భంగా విజయవాడ సమీపంలోని నున్నాలో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధాతో పాటు కొడాలి, వంశీలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా హత్య ఉదంతాన్ని కొడాలి ఒక్కసారి  గుర్తు చేసుకున్నారు.

అలాగే రాధా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదని, డబ్బులిస్తామన్నా గానీ, రాజ్యసభకు పంపిస్తామన్నా గానీ.. ఏది కోరితే అది చేస్తామని హామీ ఇచ్చినా గానీ లొంగే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తన తండ్రి తనకు ఇచ్చి వెళ్లిన ప్రజలే తనకు అతిపెద్ద ఆస్తిగా రాధా భావిస్తారని చెప్పారు.

అంటే రాధాని వైసీపీలోకి తీసుకురావడానికి అన్నీ రకాల ప్రయత్నాలు జరిగాయని పరోక్షంగా కొడాలి చెప్పినట్లు అయింది.. కానీ రాధా మాత్రం ఎట్టి పరిస్తితిల్లోనూ వైసీపీలోకి రావడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఆయన టీడీపీలో ఉన్నా ..ఆయన పనులు ఫ్రీగా చేసుకోగలుగుతున్నారు. మొత్తానికి రాధా వైసీపీలోకి వెళ్ళడం జరిగే పనిలా కనిపించడం లేదు.