ఎమ్మెల్యేలుగా ఎంపీలు..వంగా గీత ఫిక్స్?

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి జగన్…రకరకాల వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీని దెబ్బతీయడానికి ఊహకందని స్ట్రాటజీలు వేస్తున్నారు. అలాగే తమ పార్టీలో ఉండే వ్యతిరేకతని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా జగన్ ముందుకెలుతున్నారు.అదే ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళితే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చే విషయంలో జగన్ సంచనల నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే పలువురికి పరోక్షంగా సీటు లేదనే అంశాన్ని చెప్పేస్తున్నట్లు తెలుస్తోంది. అటు వారి స్థానాల్లో కొత్త నేతలని  రంగంలోకి దింపాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఎంపీలని ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ చూస్తున్నట్లు తెలిసింది. విశాఖ ఎంపీగా ఉన్న ఎం‌వి‌వి సత్యనారాయణని విశాఖ తూర్పు అసెంబ్లీ నుంచి, కాకినాడ ఎంపీ గా ఉన్న వంగా గీతని..పిఠాపురం నుంచి, అమలాపురం ఎంపీ అనురాధాని..పి.గన్నవరం లేదా అమలాపురం అసెంబ్లీ నుంచి బరిలోకి దింపుతారని తెలిసింది.

అటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్..కర్నూలులోని పత్తికొండ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. ఇలా కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యే సీట్లలో బరిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే వీరిలో కాకినాడ ఎంపీ వంగా గీతకు దాదాపు పిఠాపురం సీటు ఫిక్స్ అయిపోయిందని ప్రచారం జరుగుతుంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుపై వ్యతిరేకత ఎక్కువ ఉంది. పైగా ఆయన పి‌ఏ చక్రి..చేస్తున్న అక్రమాలపై సొంత పార్టీ వాళ్ళే గగ్గోలు పెడుతున్నారు.

దీంతో తాజాగా చక్రిని పక్కన పెట్టాలని ఎమ్మెల్యే దొరబాబుకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చేవరకు వెళ్ళేందంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దొరబాబుకు సీటు ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. నెక్స్ట్ పిఠాపురం సీటు గీతకు ఇస్తారని తెలుస్తోంది. 2009లో ఆమె ప్రజారాజ్యం నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. అందుకే గీత అయితేనే పిఠాపురంలో బెటర్ అని ఆలోచిస్తున్నారట. అయితే టీడీపీ-జనసేన పొత్తు ఉంటే వైసీపీ నుంచి ఎవరు నిలబడిన పిఠాపురంలో గెలవడం కష్టం.