హీరోయిన్ల‌ను ఓ మూల‌కు తోసేస్తారు.. అందుకే అవి మానేశా: న‌య‌న‌తార‌

లేడీ సూపర్ స్టార్ నయనతార గత కొన్నేళ్ల నుంచి సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా న‌య‌న్ మాత్రం ప్రమోషన్స్ కు హాజరు కాదు. ఈ విషయంపై నయన్ ను చాలామంది తప్పు పట్టారు. అయితే తన కనెక్ట్ సినిమాను మాత్రం నయన్‌ స్వయంగా ప్రమోట్ చేసింది.

రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయన్ భర్త, కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ నిర్మించిన ఈ చిత్రానికి అశ్విన్ శరవణన్ దశకత్వం వహించాడు. డిసెంబర్ 22న త‌మిళ‌, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఓ ఇంటర్వ్యూలో తాను ప్రమోషన్స్ కు ఎందుకు దూరంగా ఉంటాను అనే విషయం పైన న‌య‌న్ క్లారిటీ ఇచ్చింది.

తాను హీరోయిన్ గా రెండో దశాబ్దంలోకి ప్రవేశించిన తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేయాలనే కోరిక ఉండేదని.. అయితే ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదని, హీరోయిన్లకు కూడా చిన్న చూపు చూసేవార‌ని తెలిపింది. హీరోయిన్లు ఏదైనా ఆడియో ఫంక్షన్ కు హాజరైనా తమను ఓ మూలకు తోసేసే పరిస్థితి ఉండేదని చెప్పింది. ఈ కారణాల వల్లే తాను సినిమా ప్ర‌మోష‌న్స్ కు వెళ్లడం మానేశానని న‌య‌న్ చెప్పుకొచ్చింది.