కందుకూరులో ‘కమ్మ’ని పోరు..సైకిల్‌కు డ్యామేజ్ తగ్గదా..!

తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ పార్టీ అని, ఆ పార్టీలో కమ్మ వర్గమే ఉంటుందని, కమ్మలంతా టీడీపీ వారే అని విమర్శలు వైసీపీ ఎక్కువ చేస్తూ ఉంటుంది. అయితే వైసీపీలో రెడ్డి వర్గం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ విషయం పక్కన పెడితే..కమ్మలంతా టీడీపీనే అనేది కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో సగం కమ్మ వర్గం జగన్‌కే మద్ధతు ఇచ్చింది. కమ్మ వర్గం ప్రభావం ఉన్న స్థానాల్లో వైసీపీనే గెలిచింది.

దీని బట్టి చూస్తే టీడీపీకి కమ్మ వర్గమే దెబ్బవేస్తుందన్ చెప్పవచ్చు. కాకపోతే వైసీపీ పదే పదే కమ్మవర్గాన్ని విలన్ గా చూడటంతో..ఆ వర్గంలో మార్పు కనిపిస్తోంది. ఈ సారి మెజారిటీ టీడీపీ వైపు వెళ్ళేలా ఉన్నారు. అయితే అన్నీ నియోజకవర్గాల్లో కమ్మ వర్గం టీడీపీ గెలుపు కోసం కష్టపడితే కందుకూరులో మాత్రం టీడీపీని ఓడించడానికే కమ్మ వర్గం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు కమ్మ వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న స్థానాల్లో కందుకూరు కూడా ఒకటి.

కానీ ఇక్కడ టీడీపీ గెలవడం అనేది కష్టమైన పని. ఎప్పుడో 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. అంటే కందుకూరులో టీడీపీ బలం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక గత రెండు ఎన్నికల్లో ఈ సీటుని వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ వరుసగా టీడీపీ ఓడిపోవడానికి కారణమే కమ్మ వర్గమని తెలుస్తోంది. కమ్మ వర్గంలోనే గ్రూపులు ఉండటం, ఒకరికొకరు పడకపోవడం. ఒకరి ఓటమి కోసం మరొకరు కృషి చేయడంతో కందుకూరు టీడీపీకి దక్కడం లేదు.

ఇప్పుడు కూడా అక్కడ దివి శివరాం, పోతుల రామారావు వర్గాలకు పడటం లేదు. గతంలో శివరాంకు సీటు ఇచ్చేవారు. ఇప్పుడు రామరావుకు సీటు ఇస్తున్నారు. దీంతో రెండువర్గాలు సహకరించుకునే పరిస్తితి లేదు. ఫలితంగా కందుకూరులో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికీ అదే పరిస్తితి.