జగనన్న ఆర్మీతో 175 పక్కా..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే..175 సీట్లు గెలవాల్సిందే అని జగన్ చెబుతున్నారు. ఆ దిశగా ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లని గడపగడపకు తిప్పుతున్నారు. తాము ప్రజలకు మంచి పనులు చేస్తున్నామని, కాబట్టి ప్రజలు కూడా తమకు అండగా ఉంటారని అనుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యేలు, వాలంటీర్లనే నమ్ముకోకుండా జగన్..కొత్తగా 50 ఇళ్లకు ముగ్గురు వైసీపీ కార్యకర్తలని గృహ సారథులగా నియమిస్తున్నారు.

వీరి పని వచ్చి ఇంటింటికి తిరిగి..ప్రభుత్వ పథకాలని వివరించి..వారి ఓట్లని వైసీపీకి పడేలా చేయడం..అంటే పథకం అందే ఏ ఒక్కరి ఓటు పోకుండా చేయడమే గృహ సారథుల పని..అలాగే ప్రతి సచివాలయానికి కన్వీనర్లని కూడా నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలు గెలిచేందుకు సూక్ష్మస్థాయి ప్రణాళికలు, వ్యూహాలూ అమలు చేస్తున్నామని, కన్వీనర్లు, గృహ సారథులను జగనన్న ఆర్మీగా జగన్ వర్ణించారు.

మన బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చకపోతే కోట్ల మంది నష్టపోతారని, రాష్ట్రంలో పేదలు, పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతోందని,  మనం పొరపాటున అధికారంలోనికి రాకపోతే పేదలకు న్యాయం జరగదనే విధంగా ప్రచారం చేయాలని జగన్..కార్యకర్తలకు సూచిస్తున్నారు. అంటే ఏ ఒక్క ఓటు పోకుండా జగన్ పకడ్బంధిగా ప్లాన్ చేసుకున్నారు.ఇక జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే 175 సీట్లు రావడం ఈజీ అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

కాకపోతే పథకాల ఒక్కటి పంచితే సరిపోతుందా? ఇంకా ఏ సమస్యలు ప్రజలకు లేవా? వారు వైసీపీని ఎంతవరకు ఆదరిస్తారనే డౌట్ వైసీపీలో కూడా ఉంది. ఏదో ఇంటింటికి తిరిగిన..ప్రజలు సైలెంట్ గానే ఉంటున్నారు. మళ్ళీ ఏమైనా నోరు విప్పితే ఇబ్బందులు వస్తాయనే భయం ఉంది. కాబట్టి వైసీపీపై ఆగ్రహం ఉంటే అది ఇప్పుడు బయటపడకపోవచ్చు..ఎన్నికల సమయంలోనే ఇబ్బంది రావచ్చు. కాబట్టి  ఆ పరిస్తితులని కూడా చక్కదిద్దేలా పనిచేయాలి.