మొత్తానికి గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో ఉన్న కన్ఫ్యూజన్ని చంద్రబాబు క్లియర్ చేసేశారు. ఇక్కడ అసలు అభ్యర్ధి ఎవరు అనే అంశంపై క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా వెస్ట్ గోదావరి టూర్లో ఉన్న బాబు..గోపాలపురం నియోజకవర్గంలోని దొండపూడి గ్రామానికి వచ్చారు. ఇక నియోజకవర్గం రాక సందర్భంగా భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. బాబుకు ఘనస్వాగతం పలికారు. అలాగే బాబుతో పాటు ఓ వైపు మద్దిపాటి వెంకటరాజు, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఉన్నారు.
ఇక ఇప్పటికే ముప్పిడిని తప్పించి గోపాలపురం ఇంచార్జ్ బాధ్యతలని మద్దిపాటికి అప్పగించారు. ఇప్పుడు గోపాలపురం వచ్చిన సందర్భంగా బాబు..మద్దిపాటిని వచ్చే ఎన్నికల్లో ఆశీర్విదించాలని పిలుపునిచ్చారు. గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజుకు బాధ్యతలు అప్పగించామని, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుకు మరిన్ని మంచి అవకాశాలు భవిష్యత్లో కల్పిస్తామని ప్రకటించారు. అంటే మద్దిపాటికి గోపాలపురం సీటు ఫిక్స్ చేసేశారు అని చెప్పవచ్చు.
వచ్చే ఎన్నికల్లో గోపాలపురంలో మద్దిపాటి పోటీ ఖాయమైంది. వాస్తవానికి గోపాలపురం సీటు కోసం ముప్పిడి కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు. 2014లో ముప్పిడి టీడీపీ నుంచి గెలిచారు. 2019లో ఓడిపోయారు. ఓడిపోయాక కాస్త పార్టీలో యాక్టివ్ గా కనిపించలేదు. అదే సమయంలో మద్దిపాటి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. దీంతో ముప్పిడి కూడా యాక్టివ్ అయ్యి పనిచేస్తున్నారు. అయితే పార్టీ సర్వేల్లో మద్దిపాటి వైపే పార్టీ శ్రేణులు మొగ్గుచూపాయి.
పైగా లోకేష్ టీంలో మద్దిపాటి కీలకంగా ఉన్నారు..అలాగే యువనేతలకు 40 శాతం సీట్లు ఇస్తామని బాబు చెప్పారు. దీని ప్రకారమే గోపాలపురం ఇంచార్జ్ గా ముప్పిడిని తప్పించి మద్దిపాటికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన్నే అభ్యర్ధిగా ప్రకటించారు. ముప్పిడికి వేరే విధంగా పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి గోపాలపురం సీటు విషయంలో క్లారిటీ వచ్చేసింది. ఇక పోలవరం, చింతలపూడి, కొవ్వూరు సీట్లు విషయమే క్లారిటీ రావాలి.