వైసీపీలోకి హర్షకుమార్..టీడీపీకి చెక్ పెట్టేలా.!

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని తెలిసింది. తాజాగా ఆయన పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో భేటీ అయ్యి, వైసీపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో పి‌సి‌సి పదవి దక్కలేదనే అసంతృప్తితోనే ఆయన..వైసీపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిసింది. హర్షకుమార్ మూడు దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. అమలాపురం నుంచి విజయం సాధించారు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగారు. 2014 ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీకి మద్ధతు తెలిపారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగారు. 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి అమలాపురం సీటు ట్రై చేశారు. కానీ అప్పటికే అమలాపురం పార్లమెంట్ సీటులో బాలయోగి వారసుడు హరీష్ ఉన్నారు. దీంతో ఆయనకు సీటు దక్కలేదు. ఇక ఏం చేసేది లేక..2019 ఎన్నికల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు.

కాంగ్రెస్ పార్టీలో కాస్త యాక్టివ్ గానే పనిచేస్తున్నారు..ఇక ఇటీవల పి‌సి‌సి అధ్యక్షులని మార్చారు. ఈ క్రమంలో ఆయన పదవి ఆశించారు. కానీ అధిష్టానం..శైలజానాథ్‌ని తప్పించి గిడుగు రుద్రరాజుకు పదవి ఇచ్చారు. దీంతో హర్షకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీల అధ్యక్షులు అగ్రకులాలకు చెందిన వారే అని, కాంగ్రెస్ కూడా అలాగే పదవి ఇచ్చిందని, దళితులు అధ్యక్షులుగా ఉండకూడదని చెప్పి ఫైర్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌కు దూరం జరిగారు. తాజాగా వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌తో భేటీ అయినట్లు తెలిసింది. పరిస్తితులని బట్టి ఆయన వైసీపీలోకి వెళ్తారని సమాచారం. అమలాపురం పార్లమెంట్ సీటు అడుగుతున్నట్లు తెలిసింది.  కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక బోటు ప్రమాదంపై ప్రశ్నించారని చెప్పి..హర్షకుమార్‌ని అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైలులో ఉంచారు. మరి అలాంటప్పుడు హర్షకుమార్ వైసీపీలోకి వెళ్తారో లేదో చూడాలి.