రాజాం నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చాలా రోజుల నుంచి టీడీపీకి ఈ సీటు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు టూర్‌తో ఆ కన్ఫ్యూజన్ పోయినట్లే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు రాజాంతో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇక బాబు పర్యటనలకు టీడీపీ శ్రేణుల నుంచి, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పొందూరు, రాజాంల్లో రోడ్ షోలకు భారీగా జనం వచ్చారు.
వాస్తవానికి పొందూరులో బాబు సభ లేదు..కానీ అనూహ్యంగా అక్కడకు జనం రావడంతో బాబు కాన్వాయ్ ఆపి మాట్లాడాల్సిన పరిస్తితి వచ్చింది. ఆ తర్వాత రాజాం సెంటర్‌లో సభ జరగగా, అక్కడకి భారీ స్థాయిలో శ్రేణులు, ప్రజలు వచ్చారు. అయితే రాజాం పర్యటనలో బాబు పక్కన ఆద్యంతం ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్ ఉన్నారు. కానీ మాజీ స్పీకర్ ప్రతిభా భారతి మధ్యలోనే కాన్వాయ్ దిగి వెళ్ళిపోయారు. చాలా కాలం నుంచి వీరి మధ్య సీటు విషయంలో విభేదాలు ఉన్నాయి.
వాస్తవానికి రాజాం సీటు ప్రతిభా భారతిదే…కానీ 2019 ఎన్నికల్లో ఆమెని తప్పించి.. కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రుకు చంద్రబాబు సీటు ఇచ్చారు. కొండ్రు సైతం ఎన్నికల్లో ఓడిపోయాక కొన్ని రోజులు యాక్టివ్ గా లేరు. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో పనిచేస్తున్నారు. అటు ప్రతిభా సైతం..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. దీంతో గ్రీష్మ సైతం రాజాంలో దూకుడుగా పనిచేస్తున్నారు.
అయితే బాబు పర్యటన నేపథ్యంలో ప్రతిభా మధ్యలోనే సభ నుంచి వెళ్లిపోవడంతో..ఇంకా బాబు కొండ్రు వైపే మొగ్గుచూపుతున్నారని అర్ధమవుతుంది. కాకపోతే అధికారికంగా మాత్రం బాబు ఇంకా సీటు ప్రకటించలేదు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొండ్రుకే సీటు కేటాయిస్తారేమో చూడాలి.