ఉత్తరాంధ్ర టూర్‌కు బాబు..ఆ సీటు తేలుస్తారా.!

ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళుతూ..అక్కడ టీడీపీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఎక్కడకక్కడ బాబు పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. బాదుడేబాదుడు కార్యక్రమం, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని కార్యక్రమాలని నిర్వహిస్తూ జిల్లాల టూర్లకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో పల్నాడు, ఎన్టీఆర్, కర్నూలు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో బాబు పర్యటనలకు భారీ స్పందన వచ్చింది. బాబు రోడ్ షోలకు జనం భారీ ఎత్తున వస్తున్నారు.

తాజాగా పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లో ఊహించని స్థాయిలో టీడీపీ శ్రేణులు, ప్రజలు వచ్చారు. దీంతో టీడీపీలో కొత్త ఉత్సాహం వస్తుంది. అలాగే బాబు టూర్ల వల్ల ఆయా స్థానాల్లో పార్టీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే క్రమంలో బాబు..ఉత్తరాంధ్ర టూర్ వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 22 నుంచి విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మొదట 22వ తేదీన గజపతినగరంలో, 23వ తేదీన బొబ్బిలి, 24న రాజాం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

అయితే బాబు పర్యటనని భారీగా సక్సెస్ చేసేందుకు టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. అలాగే బాబు పర్యటన వల్ల ఆ మూడు స్థానాల్లో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ రావచ్చు. గత ఎన్నికల్లో ఈ మూడు స్థానాల్లో టీడీపీ ఓటమి పాలైంది. ఇప్పటికీ ఆ స్థానాల్లో టీడీపీ పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు. కొద్దో గొప్పో బొబ్బిలి స్థానంలో పార్టీ పరిస్తితి బాగానే ఉంది గాని..రాజాం, గజపతినగరం స్థానాల్లో పార్టీ అనుకున్న స్థాయిలో పికప్ కాలేదు.

పైగా రాజాం టీడీపీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గాలకు పడట్లేదు. ఎవరికి వారు సీటు కోసం పోటీ పడుతున్నారు. దీని వల్ల క్యాడర్ రెండుగా చీలిపోయింది. అయితే ఇక్కడ అభ్యర్ధి ఎవరో తేల్చేస్తే కాస్త క్లారిటీ వస్తుంది. లేదంటే ఎన్నికల వరకు ఇలాగే కొనసాగిస్తే టీడీపీకే నష్టం.