బొత్స లాస్ట్‌..చీపురుపల్లిలో డ్యామేజ్ లేదులే..!

ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పి‌సి‌సి అధ్యక్షుడుగా పనిచేసి..దాదాపు సీఎం పీఠం వరకు వెళ్ళిన బొత్స..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరీకి డిపాజిట్లు దక్కలేదు. కానీ చీపురుపల్లిలో పోటీ చేసి బొత్స రెండోస్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అదే చీపురుపల్లి నుంచి సత్తా చాటారు.

అలాగే జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. మధ్యలో మంత్రివర్గ విస్తరణ జరిగినా సరే బొత్స పదవి పోలేదు. ఇక మంత్రిగా బొత్స తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. తనకంటూ సొంత బలం, బలగాన్ని పెంచుకున్నారు. అయితే జగన్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని అందరూ నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ గడపగడపకు వెళ్లాలని సూచించారు. అయితే తాజా సమీక్షలో మంత్రులే గడపగడపకు వెళ్ళడంలో విఫలమయ్యారని జగన్ రిపోర్టు ఇచ్చారు. మెజారిటీ మంత్రులు ఈ కార్యక్రమాన్ని పెద్దగా నిర్వహించడం లేదు. అందులోనూ బొత్స గడపగడపకు అసలు వెళ్లలేదని తెలిసింది.

చీపురుపల్లి నియోజకవర్గంలో గరివిడి, గుర్ల, మెరకముడిదాం, చీపురుపల్లి మండలాలు ఉన్నాయి. గుర్ల, గరివిడి, మెరకముడిదాం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గడపగడపకు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక వైసీపీ నేతలే నిర్వహించారు. ఎక్కడా కూడా బొత్స హాజరుకాలేదు.

అయితే చీపురుపల్లిలోని మూడు వార్డుల్లో కార్యక్రమం చేపట్టగా ఒక  వార్డు సచివాలయ పరిధిలో మాత్రమే మంత్రి బొత్స పాల్గొన్నారు.  అంటే గడపగడపకు బొత్స వెళ్ళడం లేదు. దీనిపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయినా సరే బొత్స గడపగడపకు వెళ్లకపోయినా..చీపురుపల్లిలో ఆయన బలం పెద్దగా తగ్గడం కష్టం. ఇప్పటికీ అక్కడ బొత్స స్ట్రాంగ్ గా ఉన్నారు. కాబట్టి చీపురుపల్లిలో బొత్సకు వచ్చే నష్టమేమీ లేదని తెలుస్తోంది.