తెలంగాణలో అసలైన రాజకీయ క్రీడ ఇక నుంచి మొదలుకానుంది. టిఆర్ఎస్-బిజేపిల మధ్య ఆట రసవత్తరంగా సాగనుంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే హోరాహోరీ నడవటం ఖాయమని మునుగోడు ఉపఎన్నిక స్పష్టం చేసింది. ఇక ఈ పోలిటికల్ రేసులో కాంగ్రెస్ అవుట్ అయినట్లే కనిపిస్తోంది. మొన్నటివరకు కాంగ్రెస్‌కు క్షేత్ర స్థాయిలో బలం ఉందని అంతా భావించారు..కానీ ఇప్పుడు సొంత స్థానం, బలంగా ఉన్న మునుగోడులో డిపాజిట్ కోల్పోయిందంటే…ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక టిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపే వెళ్తాయని మునుగోడు ఉపఎన్నిక స్పష్టం చేసింది. మునుగోడు ఉపఎన్నికలో బిజేపి ఓటమి పాలైన సరే…గట్టి ఫైట్ ఇచ్చింది..10 వేల ఓట్లతో ఓటమి అనేది పెద్ద లెక్కలో తీసుకోవాల్సిన అవసరం లేదు. మునుగోడులో జరిగిన ఫైట్ మాదిరిగానే..రాష్ట్రంలో కూడా టిఆర్ఎస్-బిజేపిల మధ్య అసలైన పోలిటికల్ ఫైట్ ఇంకా మొదలుకానుంది. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇక నుంచి ఇంకో ఎత్తు అన్నట్లు వార్ జరుగుతుంది.
ఈ రెండు పార్టీలు డైరక్ట్ మెయిన్ ఎన్నికల్లోనే హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మధ్యలో మళ్ళీ ఉపఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎలాగో మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ కేసీఆర్ ముందస్తుకు వస్తే.. వచ్చే ఏడాది మే-జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయి. ఏదేమైనా ఇప్పటినుంచి ఎన్నికల పోరు మొదలుకానుంది. ఈ రేసులో కాంగ్రెస్ కష్టపడితే..కాస్త ముందుకొస్తుంది. ఇదే తరహాలో ఉంటే రేసు నుండి అవుట్ అవుతుందని చెప్పొచ్చు.
మరి రేవంత్ రెడ్డి పార్టీని ఏ విధంగా పైకి లేపుతారో చూడాలి. అటు కేసిఆర్ ఇంకా బిఆర్ఎస్పై ఫోకస్ చేసి..నేషనల్ పాలిటిక్స్‌లో బిజీ అవుతారు. అలాగే ఎమ్మెల్యల కొనుగోలు కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇటు బీజేపీ సైతం..కేసిఆర్‌ని నిలువరించడమే లక్ష్యంగా పనిచేయనుంది. మునుగోడులో ఓడిన సరే ఏ మాత్రం వెనక్కి తగ్గే ఛాన్స్ కనిపించడం లేదు. మొత్తానికి టిఆర్ఎస్ వర్సెస్ బిజేపి వార్ తారస్థాయిలో జరగనుంది.