ఎస్.జె. సూర్య ఈయనొక ఆల్రౌండర్ అనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, పాటల రచయితగా, నిర్మాతగా ఇలా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విభాగాల్లో పని చేశారు. తెలుగులోనూ పలుచిత్రాలకు ఈయన దర్శకత్వం వహించాడు. `ఖుషి` వంటి బ్లాక్ బస్టర్ మూవీకి ఎస్.జె. సూర్యనే దర్శకుడు. అలాగే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ఈయన `నాని` అనే సినిమా చేశాడు.
ఈ చిత్రంలో మహేష్ బాబు అమీషా పటేల్ జంటగా నటించారు. ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మంజుల ఘట్టమని నిర్మించిన ఈ చిత్రం 2004 మే 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్.జె. సూర్య.. `నాని` సినిమా ఫలితం పై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నాని సినిమా విషయంలో నాకు ఎప్పటినుంచో ఓ బాధ మిగిలిపోయింది. ప్రతి సినిమాను ప్రేమతో చేస్తాం. మన శక్తినంత ధారపోస్తాం. కానీ, నాని సినిమాలో తప్పు జరిగింది. ఈ సినిమా విడుదలయ్యాక ఓసారి మహేష్ `మీరు ఎంతో ఇష్టపడి ఈ సినిమా చేశారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఫలితాన్ని పక్కన పెడితే మిమ్మల్ని, మీ పనితనాన్ని నేను ఇష్టపడుతున్నా` అన్ని అన్నారు.
ఆయన మాటలు నాకు ఎంతో బాధను కలిగించాయి. పవన్ కళ్యాణ్ గారికి హిట్ ఇచ్చాను, కానీ మహేష్ బాబు గారికి ఇవ్వలేదు. ఆయనకు హిట్ ఇచ్చే అవకాశాన్ని భవిష్యత్తులో దేవుడు నాకు ఇస్తాడని కోరుకుంటున్నా` అంటూ సూర్య చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం ఈయన నటనతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన `వదంతి` సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న `ఆర్సీ` లోనూ సూర్య నటిస్తున్నాడు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్ సైతం ఆయన చేతిలో ఉన్నాయి.