అనంతలో జేసీ ‘టీడీపీ’..బాబుకు కన్ఫ్యూజన్.!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి అనంతపురంలో..ఆ పార్టీ పరిస్తితి చాలా వింతగా ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో టీడీపీని వైసీపీ చిత్తు చేసింది. అయితే ఇప్పుడు నిదానంగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ప్లస్ అవుతుంది. కాకపోతే వైసీపీపై వ్యతిరేకతని పూర్తి స్థాయిలో టీడీపీ వాడుకోలేకపోతుంది. పైగా టీడీపీలో కొన్ని గ్రూపు తగాదాలు కలవరపెడుతున్నాయి.

ముఖ్యంగా టీడీపీలో జేసీ ఫ్యామిలీ సెపరేట్ గా రాజకీయం నడుస్తోంది. అనంతలో టీడీపీ నేతలు ఒకదారిలో ఉంటే…జేసీ ఫ్యామిలీ మరోదారిలో ఉంటుంది. అలాగే టీడీపీ అధిష్టానం నిర్ణయించే కార్యక్రమాలని కాకుండా సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే జేసీ ఫ్యామిలీ సెపరేట్ టీడీపీ అన్నట్లు ఉంది. అలాగే జేసీ ఫ్యామిలీ..గతంలో కాంగ్రెస్ లో చేసినట్లుగా రాజకీయం చేస్తుంది. తమకు అనుకూలమైన వారికి కొన్ని నియోజకవర్గాల్లో సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అలా కొన్ని స్థానాల్లో జేసీ ఫ్యామిలీ వేలు పెడుతుంది.

ఇప్పటికే తాడిపత్రితో పాటు శింగనమల సీటు తమకు అనుకూలమైన బండారు శ్రావణికి సెట్ చేసుకున్నారు. ఇక ఇదే కాదు..పుట్టపర్తి, రాయదుర్గం, అనంతపురం అర్బన్ లాంటి సీట్లలో కూడా జేసీ ఫ్యామిలీ రాజకీయం నడుపుతోంది. ఆ మూడు సీట్లలో టీడీపీ సీనియర్లు ఉన్నారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డికి చెక్ పెట్టి..వేరే నేతకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అటు అర్బన్‌లో కూడా ప్రభాకర్ చౌదరీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు. రాయదుర్గంలో కూడా కాల్వ శ్రీనివాసులుని కూడా నిలువరించాలని చూస్తున్నారు.

ఇలా జేసీ ఫ్యామిలీ సెపరేట్ గా రాజకీయం నడిపేస్తుంది. దీని వల్ల అనంత టీడీపీలో వర్గ పోరు కనిపిస్తోంది. అసలు జేసీ ఫ్యామిలీ వేరే స్థానాల్లో జోక్యం చేసుకోకుండా, తమ స్థానం తాడిపత్రి చూసుకుంటే ఈ వర్గ పోరు లేదనే చెప్పాలి. అయితే జేసీ ఫ్యామిలీ చెప్పినట్లు బాబు చేయడానికి కూడా సిద్ధంగా కనిపించడం లేదు. జేసీ ఫ్యామిలీని కంట్రోల్ చేయడానికే చూస్తున్నారు.