ఏపీలో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు పూర్తిగా పికప్ కాకముందే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, 2023 మార్చి-జూన్ లోపు ప్రభుత్వాన్ని రద్దు చేసి..2023 సెప్టెంబర్-డిసెంబర్ లోపు ఎన్నికలు జరిగేలా చూసుకుంటారని ప్రచారం వస్తుంది. ఇప్పటికే ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా సమాచారం వెళ్ళినట్లు తెలిసింది. ఇప్పటికే బూత్ ఇంచార్జ్లని డీటైల్స్ ఇవ్వాలని ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
దీనిపై ఎమ్మెల్యేలు కొందరు అధిష్టానం పెద్దలని ఆరా తీస్తున్నారని, ఈ క్రమంలో పెద్దలు..ముందస్తు ఎన్నికల కోసమే అని చెబుతున్నారట. అంటే ముందస్తు ఎన్నికలకు వైసీపీ ప్రిపేర్ అవుతుందని తెలుస్తోంది. కానీ పైకి మాత్రం ముందస్తు ఎన్నికలు లేవనే అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలు వస్తాయని, టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలని పిలుపునిస్తున్నారు. వైసీపీ పెద్దలు మాత్రం ముందస్తు లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు.
అయితే తాజాగా ముందస్తు ఎన్నికలపై మంత్రి అప్పలరాజు పరోక్షంగా హింట్ ఇచ్చారు. తాజాగా తన సొంత నియోజకవర్గం పలాసలో కొత్త క్యాంపు ఆఫీసుని ప్రారంభించారు. ఈ సందర్భంగా అప్పలరాజు కార్యకర్తలతో మాట్లాడుతూ… ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని, సంసిద్ధంగా ఉండాలని, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎప్పుడు ఎన్నికలోచ్చినా గెలుపు వైసీపీదే అని అన్నారు.
అంటే ముందస్తు ఎన్నికలపై ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆదేశాలు వెళ్లిపోయాయని అర్ధమవుతుంది. అన్నీ అన్నుకున్నట్లుగా జరిగితే మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల తర్వాత జగన్ అసెంబ్లీని రద్దు చేసి..ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పటినుంచే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపి..తాను కూడా జనంలో ఉంటున్నారు. అటు బాబు కూడా అదే పనిచేస్తున్నారు. మరి చూడాలి ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో.