గుడివాడలో హీట్ పెంచుతున్న రావి..కొడాలిపై పోరు..!

చాలాకాలం పాటు సైలెంట్ గా ఉన్న గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు గత కొంతకాలం నుంచి గుడివాడలో దూకుడుగా పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో రావికి కాకుండా దేవినేని అవినాష్‌కు సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. దేవినేని ఓడిపోయాక వైసీపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ రావిని తీసుకొచ్చి ఇంచార్జ్ గా పెట్టారు. అటు వైసీపీ అధికారంలో ఉండటం, కొడాలి మంత్రిగా ఉండటంతో రావి పెద్దగా బయటకు రాలేదు. అసలు గుడివాడలో టీడీపీ ఉందా? అనే పరిస్తితి కనిపించింది.

కానీ ఇటీవల కాలంలో రావి దూకుడుగా రాజకీయం చేస్తున్నారు…బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా గ్రామగ్రామానికి తిరుగుతున్నారు. వైసీపీ ప్రభుత్వ బాదుడుని ప్రజలకు వివరిస్తున్నారు…నియోజకవర్గంలో కార్యకర్తలని కలుస్తున్నారు..పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అలాగే కొడాలి..చంద్రబాబుపై విమర్శలు చేస్తే అదే స్థాయిలో రావి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. తాజాగా కొడాలి..చంద్రబాబుకే కాదు, టీడీపీకి కూడా చివరి ఎన్నికలు అని, దమ్ముంటే చంద్రబాబు గాని, లోకేశ్ గాని తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు.

ఈ క్రమంలోనే రావి కౌంటరుగా రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని.. తనపై గెలిచే దమ్ముందా.? అని కొడాలి నానికి సవాల్‌ విసిరారు. అసలు కొడాలికి కిడ్నీలో రాళ్లతో పాటు మైండ్‌ కూడా పోయినట్టుందని సెటైర్ వేశారు. రాజకీయాల్లోకి రాకముందు లేని ఆస్తులు.. నేడు సుమారు రూ. ఐదువేల కోట్లు ఎలా వచ్చాయో బహిరంగంగా తెలిపే దమ్ముందా అన్నారు. దమ్ముంటే గుడివాడలో తనను ఓడించి సత్తా నిరూపించుకోవాలన్నారు.

ఈ స్థాయిలో రావి మాట్లాడుతుండటంతో గుడివాడ టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఇంతకాలం బాబుని కొడాలి పచ్చి బూతులు తిట్టిన కృష్ణా జిల్లాలో ఏదో కొంతమంది మాత్రమే కౌంటరు ఇచ్చేవారు. రావి పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆయన దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనైనా కొడాలికి చెక్ పెట్టాలనే దిశగా రావి పనిచేస్తున్నారు.

Share post:

Latest