బెజవాడలో టీడీపీలో ఎప్పటికప్పుడు కొత్త రచ్చ నడుస్తూనే ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రత్యర్ధులపై ఫైట్ చేయాల్సిన నేతలు..సొంత పార్టీలోని నేతలతో ఫైట్ చేస్తారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ గ్రూపు గొడవలకు అడ్డు అదుపు ఉండదు. ఎంపీ కేశినేని నానితో మిగిలిన నేతలకు పడదు. బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా లాంటి నాయకులకు కేశినేనితో పడదు. వీరి మధ్య రచ్చ ఎప్పటినుంచో జరుగుతుంది. బహిరంగంగా కూడా వారు విమర్శలు చేసుకున్నారు.
ఇక కేశినేనికి చెక్ పెట్టేందుకు..ఆయన సోదరుడు కేశినేని చిన్నిని దేవినేని, బోండా, బుద్దా లాంటి వారు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా బెజవాడలో రచ్చ నడుస్తోంది. అటు జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య వర్గాలకు పడటం లేదు. ఈ మధ్యనే కొట్టుకునే వరకు వెళ్లారు. చంద్రబాబు పర్యటన ముందు రెండు వర్గాల నేతల మధ్య రగడ నడిచింది. అయితే ఇలా కుమ్ముకుంటున్న నేతలు…తాజాగా బాబు పర్యటనలో కలిసిపోయి కనిపించారు.
తాజాగా చంద్రబాబు..నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ క్రమంలో నందిగామలో జరిగిన రోడ్ షోలో బాబు పక్కనే దేవినేని, కేశినేని ఉన్నారు. అటు జగ్గయ్యపేట రోడ్ షోలో నెట్టెం, తాతయ్యలు పక్క పక్కనే ఉన్నారు. అయితే బాబు పర్యటన వల్ల వీరు కలిసినట్లు కనిపించారా? లేక నిజంగా కలిశారా? అంటే బాబు ముందు ఉండాలి కాబట్టి..వారు కలిసి కనిపించారు.
అంతే తప్ప నేతల మధ్య విభేదాలు మాత్రం సమిసిపోలేదని చెప్పొచ్చు. బాబు పర్యటనలో పక్క పక్కనే ఉన్నా సరే..నేతలు ఎడమొహం, పెడమొహం అన్నట్లే ఉన్నారు. అయితే బాబు అయిన…నేతలని ఒకచోట కూర్చోబెట్టి వారి సమస్యలని తెలుసుకుని, వారిని కలపాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇలాగే వదిలేస్తే..ఎన్నికల నాటికి ఈ విభేదాలు ఎక్కువయ్యి టీడీపీకే నష్టం జరుగుతుంది.