టెక్కలిలో వైసీపీ స్కెచ్..అచ్చెన్నకు రిస్క్..!

టెక్కలి అంటే టీడీపీ కంచుకోట అనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా అచ్చెన్నాయుడు అడ్డా అని చెప్పొచ్చు…ఇక్కడ ప్రజలు అచ్చెన్నకు అండగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైసీపీ వేవ్ ఫుల్ గా ఉన్నా సరే..టెక్కలిలో అచ్చెన్నని గెలిపించారు. అయితే అక్కడ అచ్చెన్నకు చెక్ పెట్టడానికి వైసీపీ రకరకాల స్కెచ్‌లు వేసుకుంటూ వస్తుంది. అయినా సరే టెక్కలిలో అచ్చెన్న బలం తగ్గలేదు..జైలుకు పంపిన కూడా అచ్చెన్నకు ఇంకా సానుభూతి పెరిగింది తప్ప..నెగిటివ్ అవ్వలేదు.

కానీ ఎలాగైనా అచ్చెన్నని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు వేసింది..పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్‌గా గెలిచేసింది. అలా అని టెక్కలిలో అచ్చెన్న బలం పెద్దగా తగ్గింది లేదు. ఆ ఎన్నికలు కేవలం అధికార బలంతో గెలిచారు. అయితే ఏ విధంగానైనా అచ్చెన్నని నిలువరించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు వేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా ఇంచార్జ్‌గా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఏ తరహాలో టెక్కలిలో బలం పెంచుకోవడానికి చూస్తున్నారో తెలిసిందే. అక్కడ టీడీపీ శ్రేణులని వైసీపీలోకి  తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు.

అయితే టెక్కలి వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. దువ్వాడకు వ్యతిరేకంగా పేరాడ తిలక్ వర్గం ఉంది. అటు కిల్లి కృపారాణి సైతం టెక్కలి సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్..టెక్కలి వైసీపీ నేతలతో భేటీ అయ్యి..దువ్వాడకే సీటు ఫిక్స్ చేశారు. అలాగే దువ్వాడని గెలిపిస్తే పేరాడకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పారు. అటు కృపారాణి కూడా సహకరించాలని కోరారు. దీంతో టెక్కలి సీటు దువ్వాడకు అనేది ఫిక్స్ అయింది.

ఇక ఇక్కడ అచ్చెన్నని నిలువరించేందుకు వైసీపీ వర్గం…గత కొన్ని నెలలుగా టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతల కొనుగోలు..అలాగే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కళింగ ఓటర్లు అచ్చెన్నకు యాంటీ అయ్యేలా వైసీపీ ఇంటర్నల్ స్కెచ్ వేసినట్లు తెలిసింది. బలమైన నాయకులని వైసీపీ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయినట్లే కనిపిస్తున్నారు. ఇదే పరిస్తితి కొనసాగితే టెక్కలి సీటులో అచ్చెన్నకు రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఇకనుంచి అలెర్ట్‌గా ఉంటే బెటర్..లేదంటే టెక్కలి సీటు కోల్పోవాల్సి వస్తుంది.