చిరు టార్గెట్‌గా తమ్ముళ్ళు..కవర్ చేసిన అచ్చెన్న..!

మళ్ళీ టాలీవుడ్‌ల ఫ్యాన్ వార్ మొదలైంది..అది కూడా చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాతో రచ్చ షురూ అయింది. ఈ సినిమాకు ముందు వచ్చిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గాడ్‌ఫాదర్ హిట్ అయింది. దీంతో మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అని, టాలీవుడ్‌లో నెంబర్ 1 అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే పరోక్షంగా బాలయ్యకు కౌంటర్లు ఇస్తున్నారు.

దీంతో మెగా అభిమానులకు నందమూరి అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. హిట్ అయిన రీమేక్ సినిమా చేసి, పైగా పండుగ సీజన్‌లో టిక్కెట్ల ధరలు ఎక్కువ ఉన్న సమయంలో కూడా అఖండ మొదటి రోజు కలెక్షన్లని గాడ్‌ఫాదర్ దాటలేదని కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో మెగా వర్సెస్ నందమూరి అభిమానుల మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీలో నందమూరి అభిమానులు ఎక్కువ ఉంటారనే సంగతి తెలిసిందే.

ఇక వారు పార్టీ గ్రూపుల్లో ఉంటూ చిరంజీవి సినిమాపై నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఇదే టీడీపీకి పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతుంది.  దీంతో టీడీపీ అధిష్టానం అలెర్ట్ అయింది. తమ పోరాటం కేవలం వైసీపీతో అని, ఎవరూ కూడా ఇతర హీరోలపై నెగిటివ్ కామెంట్స్ పెట్టవద్దంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ శ్రేణులని కోరారు.

“దయచేసి టీడీపీ శ్రేణులు..ఐప్యాక్, బ్లూ మీడియా ట్రాప్‌లో పడకండి, టీడీపీ అందరిదీ. మన పార్టీలో అన్ని మతాల వారు, కులాల వారు, ప్రాంతాల వారు, అదే విధంగా వేర్వేరు ప్రఖ్యాత వ్యక్తుల, నటుల అభిమానులు కూడా ఉంటారు. ఒక పార్టీగా, మన ప్రధాన పోరాటం వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రభుత్వం చేసే అరాచకాలపై. ఈ ప్రస్థానంలో మనమంతా, మన దృష్టి అంతా లక్ష్యం పైనే ఉండాలి. హీరోల గురించి, వారి అభిమానుల గురించి వెటకారం, ద్వేషంతో కూడిన మాటలు మాట్లాడటం కానీ, పోస్టులు చేయడం గానీ చేయవద్దు” అంటూ అచ్చెన్న టీడీపీ శ్రేణులని కోరారు. అంటే చిరంజీవిని తమ్ముళ్ళు టార్గెట్ చేయడంతో..ఎక్కడా పార్టీకి ఇబ్బంది వస్తుందో అని చెప్పి అచ్చెన్న దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.

Share post:

Latest